గోరగుంట్లలో వైయస్ జగన్ వాగ్ధానాలు
ఏడాది పాటు ఓపిక పడితే దేవుడు ఆశీర్వదిస్తాడని, మన ప్రభుత్వం వస్తుందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్ భరోసా ప్రజలకు కల్పించారు. ఏ పథకం కావాలన్నా 72 గంటల్లోనే, మీ ఊర్లోను మీకు అందజేస్తామని హామీ ఇచ్చారు. గ్రామసచివాలయాల ద్వారా ప్రజల సమస్యలు తీరుస్తామన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా డోన్ నియోజకవర్గంలోని గొర్లగుట్ట గ్రామంలో క్వారీ కార్మికులతో శ్రీ జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడున్న గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కో బాధ చెప్పుకున్నారు. అన్నా..మీరు ముఖ్యమంత్రి కావాలన్నా..మా కష్టాలు తీర్చాలన్నా అని వేడుకున్నారు. వారందరి సమస్యలు ఓపిగ్గా విన్న శ్రీ వైయస్ జగన్ హమీలు నెరవేరుస్తామన్నారు. ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి. మన అందరి ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు ఎలాంటి పథకం కావాలన్నా కూడా ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేదు. మీ గ్రామాల్లోనే పది మందికి అన్ని సామాజిక వర్గాల నుంచి తీసుకొని మీ ఊర్లోనే గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తామన్నారు. మీకు ఇల్లు, పింఛన్, ఆరోగ్యశ్రీకార్డు ఇలా ఏమీ కావాలన్నా 72 గంటల్లోనే మీకు ఇప్పిస్తాం. ఎవరికి లంచం ఇవ్వాల్సిన పని లేదు. కులాలు, మతాలు, పార్టీలు చూడమని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా గొర్లగుట్ట గ్రామస్తులు వైయస్ జగన్‌కు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏమన్నారంటే..
క్యాన్సర్ వచ్చిన నా కుమారుడ్ని ఎవరు పట్టించుకోవడం లేదని బాధపడిన ఓ మహిళ..
అన్నా..నా కొడుక్కు క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఆరోగ్య శ్రీ కార్డు ఉన్నా పట్టించుకోవడం లేదు. మూడు లక్షలు ఖర్చు అయ్యింది. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. వర్షం వస్తే ఇంట్లో ఉండలేకపోతున్నాం. అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు రుణమాఫీ చేస్తామన్నారు. ఇంతవరకు రూ.6 వేలు ఇచ్చామన్నారు. రూపాయి కూడా చేతికి అందలేదు. పావలా వడ్డీ కూడా రావడం లేదు. పొదుపు నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను అనగా.. శ్రీ వైయస్ జగన్ కల్పించుకుంటూ.. పొదుపు నుంచి ఎవరు మానుకోవాల్సిన పని లేదు. సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాం. మన ఖర్మం ఏంటంటే చంద్రబాబు బ్యాంకులకు డబ్బులు కట్టడం లేదు. మనం వచ్చాక ఆ డబ్బులు కూడా కట్టి సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు. ఎన్నికల నాటికి ఎంత అప్పు ఉంటే ఆ డబ్బులు నాలుగు విడతల్లో నేరుగా మీ చేతికే ఇస్తామని హామీ ఇచ్చారు.
చంద్రన్న బీమా అందడం లేదు: వెంకట కృష్ణ
మా క్వారీలో పనిచేసే వారు ప్రమాదవశాత్తు చనిపోతున్నారు. చంద్రన్న భీమా ఇంతవరకు ఎవరికి అందలేదు. క్వారీలో పనిచేసే వారు చాలా మంది ఉన్నారు. అందరు బీదవాళ్లే. వాళ్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మీరు సీఎం అయ్యాక మంచి వైయస్‌ఆర్ బీమా పథకం ప్రవేశపెట్టాలని కోరారు.
వైయస్ జగన్: మంచి వైయస్‌ఆర్ బీమా పథకం ప్రవేశపెడతాం. ఆలోచిస్తాం. అందరికి న్యాయం చేస్తామన్నారు.
– మరుగుదొడ్డికి బిల్లులు ఇవ్వడం లేదు..
చంద్రబాబు వ్యక్తిగత మరుగుదొడ్డికి రూ.15 వేలు ఇస్తామన్నారు. రూ.10 వేలు పెట్టి గుంత తీసుకున్నాం. ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. మొత్తం కట్టుకున్నాక డబ్బులు ఇస్తామంటున్నారు.
వైయస్ జగన్: కనీసం నీ మాటలతోనైనా చంద్రబాబుకు బుద్ధి రావాలన్నారు.
మరో యువకుడు మాట్లాడుతూ.. నా పొలం ఆక్రమించుకున్నారు..పలుకూరు గ్రామంలో మూడేళ్లగా నా పొలాన్ని టీడీపీ నాయకులు ఆక్రమించుకున్నారు. కలెక్టర్ దగ్గరకు వెళ్లినా న్యాయం జరగడం లేదు. ఇది చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అని ఆవేదన వ్యక్తం చేయగా..
వైయస్ జగన్: ఇది దద్దమ్మ ప్రభుత్వం. మన ఎమ్మెల్యే రాజేంద్రనాథ్‌రెడ్డి నిన్ను కలెక్టర్ వద్దకు తీసుకెళ్లి సమస్యకు పరిష్కారం చూపుతారన్నారు.
అన్నా గెలిచేది మీరే..
నాకు ఐదుమంది పిల్లలు ఉన్నారు. అందర్ని హాస్టల్‌లో ఉంచాం. అక్కడ సరిగా చూడటం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా పిల్లలను చదివించాలి సారూ..వచ్చే సారి మీరు గెలుస్తారు. నేను చెబుతున్నాను.
వైయస్ జగన్: మనం వచ్చాక కరెంటు బిల్లులు చెల్లిస్తాం.
ఓనర్లు అని చెప్పుకోలేకపోతున్నాం: పిచ్చి రెడ్డి
నాపరాయి యాజమాన్యానికి గిట్టుబాటు కావడం లేదు. క్వారీ ఓనర్లు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాం. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో కరెంటు బిల్లు చాలా తక్కువ వచ్చేవి. నాపరాయికి స్క్వైర్ మీటర్‌కు రూ.18 రాయితీ ఉండేది, ఇప్పుడు ఈ ప్రభుత్వం రూ.50 వరకు పెంచింది. టన్నుకు విఫరీతంగా ధరలు పెంచారు. ఒకప్పుడు వంద కుటుంబాలను పోషించేవాళ్లం. ఇప్పుడు పది మందిమి కూడా బతకలేక పోతున్నాం. చంద్రబాబుకు మా రాయి పనికి రాదట. మేం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాం. మమ్మల్ని ఈ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతున్నారు.
వైయస్ జగన్: రాయల్టీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి నేను అధికారంలోకి వచ్చాక సాయం చేస్తాను. క్వారీ యజమానులకు మేలు చేస్తాం.
రేషన్‌కార్డు ఇవ్వడం లేదు: నాగశేషు
రేషన్‌కార్డు కోసం 15 సార్లు దరఖాస్తు చేసుకున్నాను. ఇంతవరకు ఇవ్వడం లేదు. విజయవాడలో ఆధార్‌కార్డు పొందాను. అధికారులు పట్టించుకోవడం లేదు. మా ప్రభుత్వంలో మీకు రేషన్ కార్డు ఇవ్వమని చెబుతున్నారు.
వైయస్ జగన్: ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి. మన అందరి ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు ఎలాంటి పథకం కావాలన్నా కూడా ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేదన్నారు.
చంద్రబాబుకు వెలగడం లేదు: వైయస్ జగన్
పగటిపూట ఏడు గంటలు కరెంటు ఇస్తానని నేను ఇటీవల పాదయాత్రలో చెప్పడంతో అప్పుడు చంద్రబాబుకు బుర్ర వెలిగింది. ఆ తరువాత 7 గంటల విద్యుత్ ఇస్తున్నారు. నేను చెప్పేంత వరకు కూడా సీఎంకు వెలగలేదు. ఇటీవలే జీవో కూడా విడుదల చేశారు. శనగ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు, పత్తి, మిర్చి, వరి ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఏడాది పాటు ఓపిక పట్టండి. దేవుడు ఆశీర్వదిస్తారు. రేపు మన అందరి ప్రభుత్వం వస్తుంది. ఏ ఒక్క రైతు నోట నుంచి కూడా మాకు గిట్టుబాటు ధర రావడం లేదు అని వినపడకుండా చేస్తామన్నారు.
డ్రైవింగ్ లైసెన్సు కోసం ఎంత మందికి లంచం ఇవ్వాలి?
లైసెన్స్ ఇవ్వడం లేదు. పదో తరగతి సర్టిపికెట్ కావాలంటున్నారు. అప్పట్లో మా అమ్మనాన్నలు నన్ను చదివించలేదు. ఊర్లో బతకాలంటే మర్యాద లేకుండా పోయింది. ఎస్‌ఐ జరిమానా వేస్తున్నారు. దొంగ సర్టిఫికెట్లకు లంచం ఇవ్వాల్సి ఉంది. ఎంత మందికి లంచం ఇవ్వాలన్నా.. ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేయగా..
వైయస్ జగన్: రాము నీవు చెప్పిన విషయంపై ఆలోచన చేద్దాం. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూద్దామన్నారు.
ప్రమాదం జరిగితే పట్టించుకోవడం లేదు: నాగమద్దిలేటి స్వామి
దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో 108 అంబులెన్స్ ఐదు నిమిషాల్లో వచ్చేది. ఇప్పుడు గంట సేపటి కూడా రావడం లేదు. మాలాంటి పేదోళ్లు ప్రమాదాల పడినా ఎవరు పట్టించుకోవడం లేదు. అప్పుడు కుయ్ కుయ్ అని వచ్చేది. ఇప్పుడు కావ్ కావ్ అని అరిచినా అంబులెన్స్ రావడం లేదన్నారు.
వైయస్ జగన్ : ఆరోగ్యశ్రీ, 108 పథకాలను చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఇవాళ హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లే ఆరోగ్య శ్రీ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో ఇచ్చింది. పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. 8 నెలలుగా ఆసుపత్రికి బిల్లులు ఇవ్వడం లేదు. చిన్న పిల్లలకు కాంక్లియర్ ఇన్‌ప్లాంట్ ఆపరేషన్‌కు డబ్బులు ఇవ్వడం లేదు. క్యాన్సర్ వస్తే వైద్యం చేయించడం లేదు. ఇంత దారుణంగా ఇవాళ ఆరోగ్య శ్రీని నాశనం చేస్తున్నారు. ఏడాది పాటు ఓపిక పట్టండి. ఆరోగ్యశ్రీని కనివిని ఎరుగని రీతిలో గొప్పగా చేసి చూపిస్తామన్నారు.