ASBL Koncept Ambience

పెందుర్తి బహిరంగ సభలో జననేత

పెందుర్తి బహిరంగ సభలో జననేత

 అధికారం చేపడితే పంచ గ్రామాల సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి తన వ్యక్తిగత సమస్యగా భావించి పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని, ఇరు వర్గాలకూ న్యాయం జరిగేలా చూస్తానని, తర తరాలుగా ఆ భూములపైనే ఆధారపడిన వారికి కచ్చితంగా పట్టాలు ఇస్తామని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఎన్టీపీసీ, ఫార్మాసిటీ కాలుష్యంతో బాధ పడుతున్న రెండు గ్రామాల ప్రజలకు ఉపశమనం కలిగిస్తామని, ఆ మేరకు పరిశ్రమలను తరలిస్తామని ఆయన వెల్లడించారు. ఇంకా కాలుష్య బాధితులకు ఆర్థిక సహాయం కూడా చేస్తామని చెప్పారు.

ఇప్పుడు ఎన్నికలు రావడంతో గత 20 రోజులుగా తెరపైకి రోజుకో డ్రామా తెస్తున్నారని, వాటిపైనే చర్చలు జరిగేలా చంద్రబాబు చూస్తున్నారని శ్రీ వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. తన పరిపాలన నుంచి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ఆ పని చేస్తున్నారని, ఒకవేళ ఈ 5 ఏళ్ల పరిపాలనపై చర్చ జరిగితే కనీసం డిపాజిట్లు కూడా రావని చంద్రబాబుకు తెలుసని జననేత అన్నారు. 

విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం శ్రీ  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో పట్టణం జనసంద్రంగా మారింది.

‘నేను ఉన్నాను’

3648 కి.మీ తన సుదీర్ఘ పాదయాత్ర పెందుర్తి నుంచి కూడా సాగిందని, ఆరోజు ఇక్కడి వారు చెప్పిన సమస్యలన్నీ విన్నానని, వారి ప్రతి కష్టం చూశానని, బాధలు కూడా విన్నానని, అందుకే ఒక మాట చెబుతున్నానని.. అదే ‘నేను ఉన్నాను’ అని శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడించారు.

పచ్చ నేతల భూకబ్జాలు

ప్రజలకు మేలు చేయమని ఓట్లు వేస్తే, ఇక్కడి నాయకులు గెద్దల్లా మారి వారి భూములు కాజేస్తున్నారని, ఇదే నియోజకవర్గంలోని జెర్రిపోతులపాలెంలో భూదురాక్రమణ కోసం ఒక దళిత మహిళను వివస్త్రను చేశారని గుర్తు చేశారు.

పంచ గ్రామాల సమస్య

‘ఇక్కడ పంచ గ్రామాల సమస్య ఉంది. ప్రతి ఎన్నికల్లో దానిపై హామీ ఇవ్వడం, ఆ తర్వాత మాట తప్పడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. కాబట్టి ఆరోజు చెప్పాను. ఈరోజు మళ్లీ చెబుతున్నాను. ఈ పంచ గ్రామాల సమస్యను నా వ్యక్తిగత సమస్యగా భావించి, పరిష్కారం కోసం ప్రయత్నిస్తాను. తరతరాలుగా ఆ భూములు సాగు చేసుకుంటున్న వారికి కచ్చితంగా పట్టాలు ఇప్పిస్తాను. అందుకోసం ఆలయ పెద్దలతో మాట్లాడతాను. ఇరు వర్గాలకూ న్యాయం చేస్తాను’ అని శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

కాలుష్యం–బాధితులు

ఎన్టీపీసీ, ఫార్మాసిటీ వల్ల తాడి, పిట్టవానిపాలెం వాసులు కాలుష్యంతో బాధ పడుతున్నారన్న జననేత, ఆరోజు స్థానిక ప్రతి అక్క ప్రతి చెల్లి చెప్పిన మాట గుర్తుందని అన్నారు. అందుకే అధికారం చేపడితే ఆ రెండు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని, వారికి తగిన పారితోషికం కూడా ఇస్తామని వెల్లడించారు.

పరిశ్రమలు–ఉద్యోగాలు

ఇక్కడే పరవాడ ఫార్మా సిటీ, మెడ్‌టెక్‌ జోన్, అచ్యుతాపురం సెజ్‌ ఉన్నా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని జననేత ఆవేదన చెందారు. అందుకే పార్టీ అధికారం చేపడితే, అన్ని పరిశ్రమల్లో స్థానికులకు కచ్చితంగా 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే చట్టం చేస్తామని ప్రకటించారు.

మోసం తప్ప ఏముంది?

ఎన్నికలు వచ్చాయి కాబట్టి గత 20 రోజులుగా ఎన్నో కుట్రలు, మోసాలు జరుగుతున్నాయని, వాటన్నింటినీ చూస్తున్నామని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఈ 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏం చేశారన్నది ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించాలని కోరారు. చంద్రబాబు పాలనలో మోసం మోసం తప్ప మరేదీ మనం చూడలేదని శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. 

రోజుకో డ్రామా

ఇవాళ చంద్రబాబు, తన పాలన మీద ప్రజల్లో చర్చ జరగకూడదని రోజుకో డ్రామా, మోసం, కుట్రకు తెర లేపుతున్నారని ఆరోపించారు. ఒక వేళ తన పాలన మీద కనుక చర్చ జరిగితే కనీసం డిపాజిట్లు కూడా రావని చంద్రబాబుకు స్వయంగా తెలుసని చెప్పారు. అందుకే ఈ కుట్రలు, మోసాలు గుర్తించాలని కోరారు.

ధర్మం–అధర్మం మధ్య.. 

ఇవాళ యుద్ధం ధర్మం–అధర్మం మధ్య సాగుతోందని, అంతే కాకుండా ఒక్క చంద్రబాబుతోనే కాకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో పాటు, చంద్రబాబుకు అమ్ముడుపోయిన మొత్తం మీడియాతో యుద్ధం చేస్తున్నామని జననేత తెలిపారు. 

ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి రోజుకో సినిమా, డ్రామా చూస్తున్నారని, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపుతున్నారని అన్నారు.  

గ్రామాలకు మూటల డబ్బులు

ఎన్నికలు రావడంతో ప్రతి గ్రామానికి మూటలకొద్దీ డబ్బు పంపిస్తారని, ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారని, ఆ విధంగా అందరినీ కొనే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు.

ఈ కుట్రను జయించాలని, అందుకే ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లాలని, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి రైతును కలిసి, చంద్రబాబు చేస్తున్న మోసాలు వివరించాలని కోరారు.

వారికి ఇవన్నీ వివరించండి

‘అక్కా చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. 20 రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తరవాత మన పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు అన్న ప్రతి ఏటా రూ.15 వేలు చేతిలో పెడతాడని చెప్పండి. అంతే కాకుండా మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్‌ వంటి చదువులు చదివించే పరిస్థితి లేదని, పిల్లల చదువు కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని  గుర్తు చేయండి. అందుకే 20 రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ వంటి ఏ చదువు చదవాలన్నా అన్న చదివిస్తాడని, ఎన్ని లక్షలు ఖర్చైనా అన్న చదివిస్తాడని చెప్పండి’. 

‘పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు, పసుపు–కుంకుమ పేరుతో చేస్తున్న డ్రామాలకు అస్సలు మోసపోవద్దని చెప్పండి. చంద్రబాబును నమ్మితే రుణమాఫీ జరగలేదని, సున్నా వడ్డీ రుణాలంద లేదని గుర్తు చేయండి’.

‘20 రోజులు ఓపిక పట్టి, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు ఉన్న మొత్తం రుణాన్ని నేరుగా నాలుగు దఫాల్లో వారి చేతుల్లోను పెడతాడని ప్రతి అక్కకు చెప్పండి. అంతే కాకుండా మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, సున్నా వడ్డీ రుణాలు అందుతాయని, అది ఆయన కొడుకు జగనన్నతోనే సా««ధ్యమని చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి’.

‘పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు చెప్పండి. 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ప్రతి అక్కను కలవండి. చెప్పండి.. అక్కా, చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఓపిక పట్టక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాము. ఆ తర్వాత వైయస్సార్‌ చేయూత పథకం ద్వారా నాలుగు దఫాల్లో రూ.75 వేలు నేరుగా ప్రతి అక్క చేతిలో పెడతాడని చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని మరీ మరీ చెప్పండి’.

‘గ్రామాల్లో ప్రతి రైతన్న దగ్గరకు వెళ్లండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి. 5 ఏళ్లు చంద్రబాబుకు సమయం ఇచ్చాం. కానీ రుణమాఫీ చేయలేదు. సున్నా వడ్డీ రుణాలు కూడా రావడం లేదని గుర్తు చేయండి. అలాగే 5 ఏళ్లలో ఏ ఒక్క సంవత్సరమైనా, ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర వచ్చిందా? అని అడగండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఓపిక పడదాం. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఆ తర్వాత ప్రతి రైతుకు పెట్టుబడిగా ఏటా మే మాసంలో రూ.12,500 ఇస్తాడని చెప్పండి. అదే విధంగా రాజన్న రాజ్యం వస్తుందని, మళ్లీ సున్నా వడ్డీ రుణాలు వస్తాయని చెప్పండి. ఇంకా ప్రతి పంటకు కచ్చితంగా గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు. అన్న గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తాడని చెప్పండి’.

‘గ్రామంలో ప్రతి అవ్వ, ప్రతి తాతను కలవండి. చంద్రబాబు మోసాలు వివరించండి. అదే విధంగా వారికి వస్తున్న పెన్షన్‌ గురించి ఆరా తీయండి. అప్పుడు ఆ అవ్వ అంటుంది పెన్షన్‌ రావడం లేదని, లేదా వెయ్యి రూపాయలు వస్తున్నాయని చెబుతుంది. అవ్వ ఆ సమాధానం చెప్పాక ప్రతి అవ్వను అడగండి. అవ్వా ఇప్పుడు ఎన్నికలు రాకపోయి ఉంటే, జగనన్నే రూ.2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే, ఇప్పుడు చంద్రబాబు రూ.2 వేల పెన్షన్‌ ఇచ్చేవాడా?’ అని అడగండి.

‘అందుకే ప్రతి అవ్వకు చెప్పండి. ప్రతి తాతకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఓపికపడితే, మీ మనవడు ముఖ్యమంత్రిని అవుతాడని చెప్పండి. అలా మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అవ్వా తాతలకు ఇచ్చే పెన్షన్‌ పెంచుకుంటూ పోయి రూ.3 వేలు ఇస్తాడని చెప్పండి’.

‘ఇల్లు లేని ప్రతి నిరుపేదను కలవండి. వారికి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి. ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పిన చంద్రబాబు, ఇవాళ ఊరికి కనీసం 10 ఇళ్లు కూడా కట్టించి ఇవ్వలేదని గుర్తు చేయండి. మళ్లీ పేదలకు ఇళ్లు రావాలంటే, మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే అది జగనన్నకే సాధ్యమని, ఆయనే రాజన్న రాజ్యంలో మాదిరిగా పేదలకు పక్కా ఇళ్లు కట్టించి ఇస్తాడని చెప్పండి’. అని శ్రీ వైయస్‌ జగన్‌ కోరారు.

నవరత్నాలు

నవరత్నాలు పథకాలు ప్రతి కుటుంబంలో మేలు చేస్తాయని చెప్పాలని, వాటిని ప్రతి ఇంటికి తీసుకుపోవాలని సూచించారు. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాతకు వాటి గురించి వివరించాలని కోరారు. నవరత్నాలతో ప్రతి నిరుపేద జీవితం బాగుపడుతుందని, ప్రతి రైతు, మహిళ ముఖంలో చిరునవ్వులు చూడవచ్చని నమ్ముతున్నారు. అందుకే ఆ పథకాలను కచ్చితంగా ప్రతి ఇంటికి చేరుస్తామని హామీ ఇచ్చారు.

వ్యవస్థ మారాలి

ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలని, ఒక నాయకుడు ఏదైనా చేస్తానని చెప్పి, ఆ అంశాన్ని ప్రణాళికలో పెట్టి, ఆ తర్వాత దాన్ని అమలు చేయకపోతే, ఆ పదవిని వీడి ఇంటికి పోవాలని, అప్పుడే ఈ రాజకీయాలలో నిజాయితీ, విశ్వసనీయత వస్తాయని స్పష్టం చేశారు. అందుకు అందరి సహకారం కావాలని కోరారు.

పార్టీ అభ్యర్థుల పరిచయం

పెందుర్తి నియోజకవర్గం నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అదీప్‌రాజుతో పాటు, పార్టీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి డాక్టర్‌  కె.వెంకటసత్యవతిని సభకు పరిచయం చేసిన శ్రీ వైయస్‌ జగన్, ఇద్దరినీ మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైయస్సార్‌సీపీ గుర్తు ఫ్యాన్‌ను కూడా సభకు చూపిన ఆయన, గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

Tags :