మరోసారి బెడిసి కొట్టిన జగన్ వ్యూహం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గద్దె లక్ష్యంగా ఉంటే, వ్యుహం తప్పటడుగు వేస్తుందనే ప్రచారం ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ విషయంలో మరోసారి రుజువైంది. ఈ ఎన్నికల సందర్బంగా ఆయన వ్యవహరించిన తీరే ఆయనకు రాష్ట్రంలో గత మూడున్నర ఏళ్ల తెలుగుదేశం, బిజేపీ భాగస్వామ్య ప్రభుత్వం పనితీరుపై ప్రశంసలతో పాటు విమర్శలున్నాయి. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందరికి అందుబాటులోకి లేవనే ఆరోపణలు ఉన్నాయి. జన్మభూమి కమిటీలను స్వయంగా ముఖ్యమంత్రే తప్పుపట్టి వాటిని రద్దుచేసారంటే ప్రభుత్వ పథకాలు చాలామందికి అందలేదనే విషయం అర్థమవుతోంది. అలాగే ప్రభుత్వం అనుసరిస్తున్న ఇసుక, మద్యం విధానాల పట్ల ప్రజా వ్యతిరేకత ఉంది. బలవంతంగా భూములను తీసుకోవటం, నిరుద్యోగ సమస్య పరిష్కారంలో విఫలమైందన్న విషయాన్ని విజయానికి ఉపయోగించుకోవడంలో జగన్ విఫలమయ్యారు. ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని గట్టిగా తెలియచేసే దిశలో ప్రతిపక్షంలేదనే అభిప్రాయాన్ని జగన్ మరోమారు రుజువు చేసుకున్నారు. ప్రజల్లో అధికారపార్టీపై వ్యతిరేకత సహజం, అదే సందర్భంలో ప్రజానుకూలతను ఎలా సానుకూలం చేసుకోవాలో, అదే సందర్భంలో విపక్షా వ్యూహరచనను బట్టి ఉంటుంది.
ఇదే సందర్భంలో సాగునీటి పథకాలు, ప్రధానంగా పట్టిసీమ పథకం, విశాఖ, విజయవాడ నగరాభివృద్ధి తదితరంశాలు, విద్యా, ఆరోగ్య, వైద్యసంస్థల ఏర్పాటు వంటివి ముఖ్యమంత్రి పనితీరు పట్ల ప్రజల్లో సంతృప్తిని వ్యక్తం చేసే దిశలో ఉన్నాయి.
ప్రజల్లో అధికారపార్టీపై వున్న వ్యతిరేకత తమకు సానుకూల మవుతుందనే జగన్‌పార్టీ. ముఖ్యమంత్రిని ఎంత నీచంగా విమర్శిస్తే అంతగా జనం తనను వెన్నంటి ఉంటారే నమ్మకం ఆయనలో బలపడింది. అందుకు అనుగుణంగా రోజాలాంటి మంచి భవిష్యత్తు ఉన్న మహిళా ప్రతినిధులను సైతం తిట్ల విభాగానికి ప్రతినిధులుగా వ్యవహరించే విధంగా ఆయన తీర్చిదిద్దారు. పాలన సమర్థుడని గుర్తింపు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును ఉరి తీయాలి, కాల్చి చంపండి అనటం ద్వారా బ్యూమారాంగ్ ఎత్తుగడలతో దెబ్బతినే రీతిలో వ్యవహరించి విజయాన్ని ఆయన దూరం చేసుకున్నారు. ఏ రాజకీయ పార్టీకి అయిన ప్రజల్లో అభిమానాన్ని కలిగివుండటం ఎంత ముఖ్యమో, ఆ అభిమానాన్ని ఓట్లుగా మలుచుకునే విశ్వాసాన్ని వారికి కలిగించడం అంతే అవసరం.