పరిశ్రమల ఏర్పాటుకు అడ్డంకులు ఉండవు...వైఎస్ జగన్
అవినీతి రహిత, పారదర్శక ప్రభుత్వం తమదని, రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ (డీసీ)లో యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ కీలక సమావేశానికి సీఎం హాజరయ్యారు. అక్కడ భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లాతో సీఎం సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ రౌండ్‌టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. తమ రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే కేవలం ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందని, తన కార్యాలయమే దగ్గరుండి అన్ని పనులూ చూసుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ అథారిటీ (ఇప్మా) పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు చేదోడువాదోడుగా ఉంటుందని అన్నారు. వారికి చేయూతనిచ్చి నడిపించడమే కాకుండా.. పరిశ్రమలకు అవసరమైన భూములు, విద్యుత్, నీరు సమకూర్చిపెడుతుందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌కు విశాల సముద్ర తీరం ఉందని, కొత్తగా పోర్టులు నిర్మిస్తున్నామని, వీటిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఉప్పునీటిని మంచినీరుగా మార్చడం, మెట్రో రైళ్లు, బకింగ్‌హామ్ కెనాల్ పునరుద్ధరణ, ఎలక్ట్రికల్ బస్సులు, వ్యవసాయ స్థిరీకరణ, నదుల అనుసంధానం, వ్యవసాయ రంగంలో పరిశోధనలు, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ విస్తరణ, ఆక్వా ఉత్పత్తుల విస్త తికి మార్కెట్‌లో అపార అవకాశాలున్నాయన్నారు. నాణ్యత, అధిక దిగుబడులు సాధించడానికి తాము చేసే ప్రయత్నాల్లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.