ప్రకాశం జిల్లా కందుకూరు సభలో వైఎస్ విజయమ్మ గారి ప్రసంగం
ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం. న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్నాయి. విలువలకు, వంచనకు మధ్య జరుగుతున్నాయి. ఒక్క సారి వైఎస్సార్ పాలనను గుర్తుకు తెచ్చుకోండి. వైఎస్ఆర్ ఆశయాల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. మీ అందరి సంక్షేమమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.
మీ భుజస్కంధాలపై వైయస్ రాజశేఖర్ రెడ్డి ని మోశారు. ఆయన సీఎం అయి అందరికి సంక్షేమ పథకాలు అందించారు. తొమ్మిదేళ్లుగా జగన్ బాబు మీలోనే ఉన్నాడు. మీరొకటి గుర్తుంచుకోండి. గత ఎన్నికల్లో కొద్ది మెజార్టీతో మనం ఓడిపోయాం. ఈసారి ఆ తప్పు చేయద్దని వేడుకుంటున్నాను.
వైయస్ మరణం తర్వాత ఈ తొమ్మిదేళ్లలో మేము నష్టపోయిన దానికన్నా ఈ రాష్ట్రం నష్టపోయింది ఎక్కువ. వైయస్సార్ మరణం తర్వాత సాగిన పాలన చూస్తే బాధేస్తోంది. ప్రజల కష్టాలు చూస్తుంటే బాధగా ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక జగన్ బాబు మీకోసం నిలబడ్డాడు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వైయస్సార్ మంచోడే.. జగన్ బాబు మంచోడే.. ఎప్పుడైతే బయటికి వచ్చాడో కేసులు పెట్టారు. ఈ కుటుంబాన్ని క్షోభ పెట్టారు. ఓదార్పు యాత్ర చేస్తానని పావురాలగుట్టలో జగన్ బాబు మాట ఇచ్చాడు. మీకోసం నిలబడ్డాడు. మీరు జగన్ బాబుని అక్కున చేర్చుకోవడం...వైఎస్ఆర్ కోసం అంత మంది చనిపోవడం కాంగ్రెస్ కు నచ్చలేదు. జగన్ కు వచ్చిన కష్టాలు చాలా ఉన్నాయి. ఆయన మీతో ఎప్పుడూ చెప్పలేదు.
ప్రత్యేక హోదా కోసం..జనం కష్టాలు తీరడం కోసం జగన్ బాబు ఎన్నో దీక్షలు చేశారు. ధర్నాలు చేశారు. నేను కూడా దీక్ష చేశాను. ఎన్నికలు ఉన్నాయని మూడు నెలల నుంచి చంద్రబాబుకు మీరు(ప్రజలు) గుర్తొస్తున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఎప్పుడు బయటకు రాలేదు. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయాక... జగన్ బాబును జైల్లో పెట్టారు. 18 మందిని గెలిపించుకోవడానికి బయటకు వచ్చా. మీరంతా నా కుటుంబం. అందుకని నేను బయటకు రావాల్సి వచ్చింది. ఈ తొమ్మిదేళ్లలో జగన్ బాబు మీతోనే ఉన్నాడు. ఒకటే చెప్తున్నా జగన్ అనుకుంటే చేస్తాడు.. సాధిస్తాడు. రాజారెడ్డిని హత్య చేశారు. ఎవరు సాయం చేశారో మనమంతా చూశాం. తొమ్మిదేళ్ల క్రితం వైయస్సార్ మృతి చెందారు. అది అనుమానాస్పద మృతి అని నా నమ్మకం. నాలుగు నెలల క్రితం వైజాగ్ లో గుండుసూదులు కూడా పోని చోట కత్తులు వెళ్లాయి. మా మరిదిని కూడా హత్య చేశారు. ఈ నలుగురు ప్రజల కోసం నిలబడిన వాళ్లే.
జగన్ బాబుని మీ ఆశీర్వాదం బలమే నడిపిస్తోంది. తొమ్మిదేళ్లలో ఎన్నో కుట్రలు, కుతంత్రాలు భరించాడు. 16 నెలల పాటు కొడుకును దూరం చేశారు. పాదయాత్రకు వెళ్లే సమయంలో నా బిడ్డను మీకు అప్పగించాను. మీ ఆశీర్వాద బలమే గండం నుంచి జగన్ బాబును గట్టెక్కించింది. వివేకానంద హత్య విషయంలో జగన్ పై ఆరోపణలు చేస్తున్నారు. రాజారెడ్డి హత్య కేసు నిందితుడు తిరుగుతున్నా చట్టం తన పని తాను చేసుకుపోతుందని వైఎస్ అన్న విషయాన్ని గుర్తు చేసుకోండి. వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి గానీ, థర్డ్ పార్టీకి గానీ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
చంద్రబాబునాయుడు ప్రజలకు ఏం చేశారో చెప్పడం లేదు. కాబట్టి చంద్రబాబు కు ఓటు అడిగే హక్కు ఉందా? 2009 ఎన్నికల సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను చెప్పింది చేశానని.. చెప్పనివీ చేశానని అన్నారు. ఓటు వేయాలని అడిగారు. ఒక్క వాగ్దానం కూడా ఇవ్వలేదు. మీరు గెలిపించారు. పరిటాల రవి హత్య కేసులో అసెంబ్లీలో యాగీ చేశారు. అప్పుడు కొడుకు అని కూడా చూడకుండా నిరూపణ అయితే ఉరితీయాలని వైఎస్ఆర్ అన్నారు. సిబిఐ విచారణకు ఆదేశించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయడం లేదు చంద్రబాబు?
జగన్ బాబు పై హత్యాయత్నం జరిగినప్పుడు.. వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు సానుభూతి వ్యక్తం చేయలేదు. చంద్రబాబు పై బాంబు దాడి జరిగినప్పుడు వైయస్సార్ ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసు. అప్పట్లో వైఎస్ఆర్ ఆ ఘటనను నిరసిస్తూ ధర్నా చేశారు. అదీ వైఎస్సార్ అంటే. వివేకానంద చనిపోతే పరవశంగా ఉందని చంద్రబాబు పుత్రరత్నం అంటాడు. ఆయనకు ఎందుకు అంత పరవశం? వైయస్సార్ కొడుకు జగన్. మాట ఇస్తే మడమ తిప్పే రకం కాదు. రాష్ట్రాన్ని గొప్ప స్థానంలో నిలపాలన్నది జగన్ కోరిక. జగన్ వ్యక్తిత్వం ఎలాంటిదో మీ అందరికీ తెలుసు.
వెలిగొండ, గుండ్లకమ్మ, రాళ్లపాడు ప్రాజెక్టులను పూర్తి చేసే స్థితిలో ఈ ప్రభుత్వం లేదు. వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టులు వైఎస్ఆర్ కాలంలోనే ఎక్కువ శాతం పూర్తయ్యాయి. చంద్రబాబుకు మూడు నెలల ముందు ప్రజలు గుర్తుకు వస్తున్నారు. నవరత్నాలను కాపీ కొడుతున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వుంది. ఎన్ని వాతలు పెట్టుకున్నా పులి పులే.. నక్క నక్కే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏం చేస్తాడో జగన్ బాబు అందరికీ చెప్పాడు. రైతులో భరోసా నింపేందుకు పంట పెట్టుబడి కోసం ప్రతి ఏటా 12,500.
- వడ్డీలేని రుణాలు.
- 9 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తూ రైతులకు ఉచితంగా బోర్లు.
- బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది
- రైతులు చనిపోతే వారి కుటుంబాలకు 7 లక్షలు
- 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
- ప్రతి మండల కేంద్రంలో కోల్డ్ స్టోరేజ్
డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా కింద ఆదుకుంటాం. సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు తోడుగా ఉంటాము. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి అవసరాలు తీరుస్తాం. ఆరోగ్యశ్రీ కింద ఎక్కడైనా వైద్యం చేయించుకునే పరిస్థితి తీసుకువస్తాం. అమ్మఒడి పథకం కింద పిల్లలను బడికి పంపితే చాలు ఏడాదికి 15 వేలు అందజేస్తాం. ఉన్నత చదువులు చదవడానికి పేదరికం అడ్డుగా ఉంటుంది. ఎంతోమంది డబ్బులు లేక చదవలేకపోతున్నారు. ఎన్ని లక్షలు ఖర్చయినా జగన్ బాబు చదివిస్తాడు. పిల్లల హాస్టల్ ఫీజు కోసం ఏటా 20 వేల రూపాయలు ఇస్తాడు.
మద్యపానం కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. జగన్ బాబు సీఎం కాగానే మూడు దశల్లో మద్యపాన నిషేధం చేస్తారు. జగన్ బాబుని ఒక్కసారి ఆశీర్వదించాలని కోరుతున్నాను. కందుకూరుకు రామతీర్థం ద్వారా నీళ్లు వచ్చాయంటే అది వైఎస్సార్ చలవే. మీ కోసమే జగన్ రాజకీయాల్లోకి వచ్చారు.ఆశీర్వదించండి. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడు. కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మహీధర్ రెడ్డి గారిని.. ఎంపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలి. మీ పవిత్రమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు వేయండి. మీ గుండెల్లో గూడుకట్టుకున్న వైయస్సార్ భార్యగా అడుగుతున్నా. జగన్ బాబును ఆశీర్వదించండి.