MKOne Telugu Times Youtube Channel

వలంటీర్ లే జగన్ సైన్యం

వలంటీర్ లే జగన్ సైన్యం

ఆంధప్రదేశ్‍లో కరోనా వైరస్‍ విపత్తును ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్మోహన్‍ రెడ్డికి తోడుగా వలంటీర్లు చేసిన కార్యక్రమాలే నేడు ఎపిలో కరోనా బాధితులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‍ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు వలంటీర్లు ఈ వైరస్‍ను ఎదుర్కోవడంలో రాష్ట్రానికి తోడుగా నిలిచారు. దీంతోపాటు  ప్రజలకవసరమైన నిత్యావసరాల్ని అందుబాటులో ఉంచడం.. లాక్‍డౌన్‍ పటిష్టంగా అమలు చేయడం.. అనుమానిత రోగుల్ని గుర్తించడం.. కోవిడ్‍ 19 వెలుగుచూసిన ప్రాంతాల్లో రెడ్‍జోన్‍ అమలు చేయడం.. వంటి చర్యల్లో వలంటీర్ల సేవలను ప్రశంసించకుండా ఉండలేము.

జగన్‍ తీసుకున్న పాలనాపర నిర్ణయాల్లో ఒకటి గ్రామస్థాయి వలంటీర్ల వ్యవస్థ. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల కొరతను నివారించడంతో పాటు ప్రజల్తో నేరుగా ప్రత్యక్షంగా అనుసంధానమయ్యే రీతిలో ఆయన గ్రామీణ సచివాలయ వ్యవస్థను రూపొందించారు. సుమారు 3లక్షల మందిని ఇందులో నియమించారు. ఎటువంటి విమర్శలకు తావులేకుండా పారదర్శకంగా ఈ నియామకాలు చేపట్టారు. రాజ్యాంగ బద్దంగా రిజర్వేషన్లను ఇందులో పాటించారు. మూడేళ్ళ ప్రొబెషన్‍ సమయంలో నిర్దిష్ట మొత్తాల్నే గౌరవ వేతనాలుగా చెల్లించినప్పటికీ ఆ తర్వాత వీరంతా ప్రభుత్వోద్యోగులుగా పరిగణించబడతారు. గ్రామీణ, వార్డు స్థాయిల్లో ప్రజలతో వీరు నేరుగా సంబంధ బాంధవ్యాల్ని కలిగి ఉంటారు. రాష్ట్రంలోని ప్రతీ 50కుటుంబాలకు ఓ వలంటీర్‍ను ప్రభుత్వం నియమించింది. ఈ 50కుటుంబాల ఆర్ధిక, సామాజిక, ఆరోగ్య పరిస్థితుల్ని వీరెప్పటికప్పుడు నమోదు చేస్తుంటారు. విద్య, ఉద్యోగ, ఉపాధి తదితర అంశాల్ని కూడా ఆరాతీస్తారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల వ్యవస్థ ఆంధప్రదేశ్‍లో పటిష్టంగా రూపుదిద్దుకుంది. రాష్ట్రంలో ఏ మూల ఏ చిన్న కదలిక ఏర్పడ్డా వీరి దృష్టికొస్తోంది. ఈ కారణంగానే మిగిలిన రాష్ట్రాల్తో పోలిస్తే ఇక్కడ కోవిడ్‍ 19 వ్యాధిగ్రస్తుల గుర్తింపు పక్రియ వేగంగా జరిగింది. ఇళ్ళల్లోని అనారోగ్య పీడితుల ఆరా సమర్ధవంతంగా సాగింది.

అలాగే వీరందరికీ ఆరోగ్య, సామాజిక రక్షణ కల్పించడంలో ఈ రాష్ట్రంలోని యంత్రాంగం సఫలీక•తమైంది. చంద్రబాబు సమయంలో క్షేత్రస్థాయిలో పని చేసేందుకు నియమించిన జన్మభూమి కమిటీలు తీవ్ర ఆరోపణలకు గురయ్యాయి. ప్రభుత్వ పథకాల అమల్లో విమర్శలపాలయ్యాయి. ఇవన్నీ ప్రైవేటు కమిటీలు. వీటికి చట్టబద్దత లేదు. ఈ కారణంగానే జగన్‍ ఇలాంటి వాటి జోలికిపోలేదు. వార్డు, సచివాలయాల వ్యవస్థను పటిష్టంగా రూపొందించారు. ఈ సిబ్బంది నియామకం చట్టబద్దంగా సాగింది. వీరికి ప్రభుత్వం తరపున నిర్ణయాలు తీసుకునే అధికారం దఖలైంది. అలాగే వీరు తప్పులు చేస్తే వీరిని దండించే అధికారం ప్రభుత్వానికేర్పడింది. ఈ కారణంగా సహాయక కార్యక్రమాల అమల్లో పారదర్శకత కొనసాగుతోంది. ఇక అధికారుల స్థాయిలో గతంలో ఎప్పుడూలేని సమన్వయం ఇప్పుడు నెలకొంది. ప్రతిసోమవారం ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ఉన్నతాధికారులు ఇందులో భాగస్తులౌతున్నారు. నేరుగా సమస్యల్ని ప్రజల్నుంచి తెలుసుకుంటున్నారు. వాటిపరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులంతా ఒక చోటకు చేరడం, వారిలో సమన్వయాన్ని పెంచుతోంది. నేడు కిందిస్థాయి సమస్యలను పరిష్కరించడంలోనూ, కోవిడ్‍ 19 వైరస్‍ను ఎదుర్కోవడంలో గ్రామసేవకుల సహాయంతో ప్రభుత్వం సరైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ అందరిచేత ప్రశంసలను అందుకుంటోంది.

 

Tags :