అమెరికాలో దుర్గమ్మ వారి పూజలు

అమెరికాలో దుర్గమ్మ వారి పూజలు

ఇతర దేశాలలో వుండే అనేక మంది భక్తులు, అక్కడి దేవాలయాల నుంచి వచ్చే విజ్ఞప్తుల మేరకు ఆంధ్ర ప్రదేశ్‌ దేవాదాయ శాఖ  కొన్ని కొత్త పథకాలు రూపొందించిందని, రాష్ట్రంలోని దేవస్థానాలు, పెద్ద దేవాలయాలు ఎన్‌ఆర్‌ఐలకు మరిన్ని సేవలు అందించటానికి తయారవుతున్నాయని దేవాదాయ శాఖ కమీషనర్‌ హరి జవాహర్ లాల్ తెలిపారు.

రాష్ట్రంలోని 10 పెద్ద దేవాలయాలు, 175 కు పైగా పెద్ద గుడులులకు ఆన్లైన్‌ సేవలు అందించే వీలుగా దేవాదాయ శాఖ పోర్టల్‌ (aptemples.ap.gov.in)ని ఏర్పాటు చేశామని, ప్రస్తుతం ఈ పోర్టల్‌కి సపోర్ట్‌గా సమగ్ర సేవలు మరింత సులువుగా అందించేందుకు యాప్‌ తయారు చేస్తున్నామని జవహర్‌ లాల్‌ తెలిపారు. అదే  విధంగా దేవాదాయ శాఖ నడిపిస్తున్న ఈ సమగ్ర పోర్టల్‌ వలన భక్తులు తాము కోరుకున్న గుడి లో ఇ హుండీ ద్వారా దేమునికి కానుకలు వెయ్యొచ్చని, ఇ డొనేషన్‌ ద్వారా విరాళాలు ఇవ్వొచ్చని తెలిపారు.

భక్తులకు మరిన్ని సేవలు అందించే పథకాలలో భాగం గానే విజయవాడ ఇంద్రకీలాద్రి పై కొలువుండి నిత్యం వేలాది భక్తులకు దర్శనం ఇస్తున్న దుర్గమ్మ వారు అమెరికాకి వచ్చి అక్కడ పట్టణాలలో ఉన్న గుడిలలో భక్తులకు దర్శనం ఇచ్చి, పూజలు చేసుకొనే ఏర్పాట్లు చేస్తున్నామని జవహర్‌ లాల్‌ తెలిపారు.

శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నుంచి ఐదుగురు పూజారులు అమెరికా వచ్చి అక్కడ గుడిలలో అమ్మవారి పూజలు నిర్వహిస్తారని శ్రీ హరి జవహర్‌ లాల్‌ తెలిపారు. అక్కడ నిర్ణయించిన గుడి యాజమాన్యం ఇచ్చే సూచనలు బట్టి అమ్మవారి కుంకుమ పూజలు, హోమాలు, కళ్యాణాలు జరప బడతాయని,  భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని అమ్మ వారి పూజలలో పాల్గొనాలని తెలిపారు.

ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ కొన్ని నెలల క్రితం విదేశాల లోని భక్తులు, దేవాలయాల అనుసంధానం కోసం కొన్ని సంవత్సరాలుగా తెలుగు టైమ్స్‌ పత్రికను నిర్వహిస్తూ, దేవాలయ కార్యక్రమాలు చేస్తున్న చెన్నూరి వేంకట సుబ్బారావుని సలహాదారు గా (Adviser-Temples, NRI Wing) నియమిచ్చామని, చెన్నూరి సుబ్బారావు పర్యవేక్షణ లోనే దుర్గమ్మవారి అమెరికా యాత్ర చేపట్టామని శ్రీ హరి  జవహర్‌ లాల్‌ తెలిపారు.

మే 26వ తేదీన శాన్‌ హోసేలోని సత్యనారాయణ స్వామి దేవాలయంలో మొదలయ్యే ఈ పూజా కార్యక్రమం, 5 వారాలలో 10 పట్టణాలలో జరుగుతుందని జవహర్‌ లాల్‌ తెలిపారు. మరిన్ని వివరాలకు సుబ్బారావుని (adviser.temples.nriwing@gmail.com) సంప్రదించవచ్చని తెలిపారు.

 

Tags :