తానా ఫౌండేషన్ ట్రస్టీ పదవికి పోటీ పడుతున్న రవి మందలపు

తానా ఫౌండేషన్ ట్రస్టీ పదవికి పోటీ పడుతున్న రవి మందలపు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్‍కు 2021-25 సంవత్సరానికిగాను జరుగుతున్న ట్రస్టీ ఎన్నికల్లో ప్రస్తుతం ఫౌండేషన్‍లో సెక్రటరీగా ఉన్న రవి మందలపు మరోమారు పోటీ పడుతున్నారు. ఫౌండేషన్‍ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన రవి మందలపు ఈసారి ఎన్నికల్లో కూడా తనను గెలిపించాలని సభ్యులను కోరుతున్నారు. ఫౌండేషన్‍ తరపున చేసిన సేవా కార్యక్రమాల్లో పారదర్శకత ఉండే విధంగా చూస్తానని అంటూ, తాను నరేన్‍ కొడాలి ప్యానెల్‍ తరఫున ఫౌండేషన్‍ ట్రస్టీగా బరిలో దిగినట్లు తెలిపారు. దాతల అభిప్రాయాల మేరకే వారు కోరిన కార్యక్రమాలకే నిధులు ఖర్చు చేసే విధంగా చూడటమే తన లక్ష్యమని అంటూ, తానా ఫౌండేషన్‍లో దాతలకు రెండు ట్రస్టీ స్థానాలు రిజర్వ్ చేశారని, ఈసారి ఆ స్థానాలకు కూడా పోటీ జరగడం దురదృష్టకరమని, ఇక నుండి ఫౌండేషన్‍కు అత్యధిక విరాళాలు ఇచ్చిన మొదటి రెండు స్థానాల్లో ఉన్నవారికే ట్రస్టీ పదవులు అప్పగించాలని ఆయన కోరారు. 

తానాతో ఆయనకు 2004 నుంచి అనుబంధం ఉంది. 2015 నుంచి ఆయన తానాలో యాక్టివ్‍గా పాల్గొంటున్నారు. 2015-17లో తానా కమిటీ చైర్‍గా, 2017-21 వరకు తానా ఫౌండేషన్‍ ట్రస్టీగా, 2019-2021 వరకు తానా ఫౌండేషన్‍ సెక్రటరీగా కూడా ఆయన పనిచేశారు. తానా కాన్ఫరెన్స్లకు ఆయన విరాళాలను కూడా ఇచ్చారు. కోవిడ్‍ సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని పేదలకు నిత్యావసర వస్తువులను అందించారు. ఆంధప్రదేశ్‍లో ప్రభుత్వ పాఠశాలల డిజిటల్‍ తరగతులకు కూడా ఆయన విరాళాలిచ్చారు. కృష్ణాజిల్లాలోని పసుమర్రు గ్రామంలో శ్మశానవాటిక నిర్మాణానికి విరాళాన్ని ఆయన అందించారు. ఇలా ఎన్నో కార్యక్రమాలకు ఆయన సహాయాన్ని అందించారు. తనను తానా ఫౌండేషన్‍ ట్రస్టీగా ఎన్నుకుంటే మరింతగా సేవా కార్యక్రమాలను నిర్వహించి కమ్యూనిటీకి సహాయ పడుతానని చెబుతున్నారు.

 

Tags :