అర్చకులకు వంశపారపర్యహక్కుకు జగన్ ఓకె

అర్చకులకు వంశపారపర్యహక్కుకు జగన్ ఓకె

దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేస్తూ తరాలుగా పొట్ట పోసుకుంటున్న వేలాది అర్చకుల వంశ పారంపర్య హక్కును 1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ రద్దు చేశారు. దరమిలా తర్వాత అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి అర్చకుల కష్టాలను తెలుసుకుని రద్దు చేసిన చట్టానికి 2007లో 34/3 పేరుతో చట్టాన్ని సవరిస్తూ అర్చకులకు వంశ పారంపర్య హక్కుల పూర్వోధ్ధరణ కోసం  ఉత్తర్వులు తెచ్చారు. త్వరలో అర్చకుల సంక్షేమం కోసం ఉత్తర్వులు ఇవ్వాలనుకునే లోపు మత్యువు  కబళించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వారు ఈ సవరణ ఉత్తర్వులను తొక్కిపెట్టారు. వంశ పారంపర్య హక్కులు కలిగివున్న అర్చకుల కన్నీళ్లను వారు పట్టించుకోలేదు. 2017లో ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ ఇచ్చి, నెల రోజుల్లో చర్యలు చేపడతామని బుకాయిస్తూ అర్చకుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. మూడేళ్లు గడిచినా, ఎన్నిసార్లు అర్చకులు విన్నవించుకున్నా గత ప్రభుత్వం అర్చకుల విజ్ఞాపనలను కనీసంగా కూడా పట్టించుకోలేదు. అర్హులైన అర్చకులు, అర్చక సంఘాలు అప్పటి నుంచీ పోరాడుతూనే ఉన్నారు ఇందుకు సంబంధించి 2017లో పరిశీలిస్తామని జీవో నంబర్‌ 2 పేరుతో ఉత్తర్వులు ఇచ్చి, నెల్లాళ్లలో పరిశీలిస్తామని చెప్పిన గత ప్రభుత్వం అర్చకుల న్యాయమైన హక్కులకు జెల్ల కొట్టింది. ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ మీద నెల రోజుల్లో స్పందిస్తానన్న గత ముఖ్యమంత్రి అర్చకులను మోసం చేశారు.

 

ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2007లో తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన హయాంలో చేసిన చట్ట సవరణకు మరింతగా మెరుగులు దిద్ది, అర్చక సంక్షేమం, దేవాలయాల ఉన్నతిని కోరుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో జిల్లాలో దాదాపు 90 శాతం ఆలయాల్లో పూజాదికాలు నిర్వహిస్తున్న వేలాది అర్చకులకు లబ్ది చేకూరనున్నది. ఈ ఉత్తర్వుల ప్రకారం దేవాదాయ శాఖకు అనుబంధంగా ఉన్న ఆలయాలను మినహాయించి వంశపారంపర్యంగా హిందూ దేవాలయాల్లో పూజాదికాలు నిర్వహిస్తున్న వంశపారంపర్య అర్చకులు, మిరాశీదార్లకు లబ్ది చేకూరనున్నది. హింధూ ధర్మానికి చెందిన సంస్థల్లో 1987లో రద్దు చేసిన హక్కులను తిరిగి ఇప్పుడు సాకారం చేశారు. 1966 నుంచి వస్తున్న అర్చక వంశపారంపర్య హక్కును 1987లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కోల్పోయిన హక్కును తాత్కాలికంగా 2007లో పొందారు. దరిమిలా ఇప్పుడు సంపూర్ణహక్కులను ఈ ఉత్తర్వు ద్వారా పొందనున్నారు.

 

Tags :