తానా ఎన్నికలు... ఏకగ్రీవాలు

తానా ఎన్నికలు... ఏకగ్రీవాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికల్లో అన్నీ పదవులకు పోటాపోటీగా అభ్యర్థులు తమ నామినేషన్‌లను దాఖలు చేశారు. తానా ఎన్నికల కమిటీ ఈ?నామినేషన్‌ల పరిశీలన గడువు ముగియడంతో నియమ నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్‌లను తిరస్కరించింది. ఒక్కరే నామినేషన్‌ను వేసిన పదవులకు అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించింది.

తానా కార్యదర్శిగా సతీష్‌ వేమూరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన నిరంజన్‌ శృంగంవరపు ప్యానల్‌ తరపున బరిలోకి దిగారు. ఆయనకు ప్రత్యర్థిగా నామినేషన్‌ వేసిన నరేన్‌ కొడాలి వర్గానికి చెందిన భక్తబల్లా నామినేషన్‌ను ఎన్నికల కమిటీ తిరస్కరించింది. ఫౌండేషన్‌ ట్రస్టీగా ఆయన పదవీకాలం 2023 వరకు ఉండటం వల్ల, ఆయన రాజీనామా చేసినట్లు చెప్పినప్పటికీ ఆ రాజీనామా సరైన సమయంలో అందలేనందున భక్తబల్లా నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఎన్నికల కమిటీ ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల కమిటీ చైర్మన్‌ కనకంబాబు ఐనంపూడి తెలిపారు.

ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌ పదవికి పోటీ పడిన హితేష్‌ వడ్లమూడి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కూడా తానా ఎన్నికల కమిటీ ప్రకటించింది. ఆయన నిరంజన్‌ వర్గం తరపున ఈ పదవికి పోటీ పడ్డారు. కాగా నరేన్‌ వర్గం తరపున ఈ పదవికి పోటీ పడ్డ హేమకానూరు నామినేషన్‌ను నిబంధనల ప్రకారం సరిగా లేనందున తిరస్కరించినట్లు ప్రకటించింది. నామినేషన్‌లో తానా సభ్యుల సంతకాలు కూడా ఉండాలన్న నిబంధనను ఆయన పాటించక పోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఎన్నికల కమిటీ ప్రకటించింది. దీంతో ఈ పదవికి హితేష్‌ వడ్లమూడి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కౌన్సిలర్‌ ఎట్‌ లార్జ్‌ పదవికి పోటీ పడిన  లోకేష్‌ నాయుడు కొణిదెల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన నరేన్‌ కొడాలి వర్గం తరపున ఈ పదవికి పోటీ పడ్డారు. కాగా ఆయనకు ప్రత్యర్థిగా సుమంత్‌ రామిసెట్టి నామినేషన్‌ వేసినప్పటికీ ఆయన నామినేషన్‌ పత్రాలు రెండుసార్లు పంపడం వల్ల ఆయన నామినేషన్‌ను నిబంధనల ప్రకారం ఎన్నికల కమిటీ తిరస్కరించింది. ఆయన తన రెండో నామినేషన్‌ను పంపవద్దని ఫెడక్స్‌ సంస్థకు చెప్పినప్పటికీ వారు రెండోసారి కూడా డెలివరీ చేయడంతో ఆయన నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. దీంతో లోకేష్‌ కొణిదెలను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

తానా బోర్డు సభ్యురాలిగా లక్ష్మీదేవినేని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల కమిటీ ప్రకటించింది. డోనర్‌ కోటాలో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల కమిటీ సభ్యుల్లో ఒకరైన ఆంజనేయులు కోనేరు తెలిపారు. లక్ష్మీదేవినేని ఎన్నిక ఏకగ్రీవమేనని ముందే అందరూ ఊహించారు.

తానా నార్తర్న్‌ కాలిఫోర్నియా రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ పదవికి రామ్‌ తోట ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల కమిటీ ప్రకటించింది. అప్పలాచియాన్‌ రీజినల్‌ రిప్రజెంటేటివ్‌గా నాగ మల్లేశ్వర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సౌత్‌ సెంట్రల్‌ రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ పదవికి కిషోర్‌ యార్లగడ్డ, నార్త్‌ వెస్ట్‌ రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ పదవికి పద్మ భోగవల్లి, సౌత్‌ వెస్ట్‌ రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ పదవికి రత్నప్రసాద్‌ గుమ్మడి, రాకీ మౌంటెన్స్‌ రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ పదవికి శరత్‌ కొమ్మినేని, న్యూయార్క్‌ రీజినల్‌ రిప్రజెంటేటివ్‌గా దిలీప్‌ కుమార్‌, సదరన్‌ కాలిఫోర్నియా రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ పదవికి ప్రతాప్‌ చెరుకూరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి ప్రస్తుత తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ శృంగవరపు, తానా మాజీ బోర్డ్‌ చైర్మన్‌ నరేన్‌ కొడాలి, మాజీ ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస గోగినేని పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.  నిరంజన్‌ శృంగవరపు ప్యానల్‌, నరేన్‌ కొడాలి ప్యానల్‌ మధ్య ఈ ఎన్నికలు ఉత్కంఠగా జరుగుతున్న విషయం విదితమే.

 

Tags :