న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద అంబరాన్నంటిన ‘తానా’ బతుకమ్మ సంబరాలు

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద  అంబరాన్నంటిన ‘తానా’ బతుకమ్మ సంబరాలు

న్యూయార్క్ లో ఈనెల 16 న ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో నిర్వహించిన బంగారు బ్రతుకమ్మ మునుపెన్నడూ జరగని ఒక చారిత్రాత్మక ఘట్టంగా విశ్వవేదికపై నిలిచింది. ప్రముఖమైన మన తెలుగు పండగను మొట్ట మొదటిసారి ప్రపంచవ్యాప్తంగా విశ్వవేదికపై ఘనంగా నిర్వహించిన ఘనతని తానా సొంతం చేసుకుంది. ఇసుకేస్తే రాలనంత జనంతో తిరుగాడే టైమ్ స్క్వేర్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక పై 20 అడుగులలో తీర్చిదిద్దిన బ్రతుకమ్మ, అంబరాలు తాకుతూ సగర్వంగా నిలిచి సంబరాలు చేసుకుంది. విశ్వవేదిక పై మొట్టమొదటిసారిగా ఒక తెలుగు ఈవెంట్ అందునా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం తెలుగువారందరూ గర్వించదగిన విషయం. లార్జర్ దాన్ లైఫ్ రేంజిలో విశ్వనగరంలో ఏర్పాటుచేసిన 20 అడుగుల బంగారు బతుకమ్మ చరిత్ర పుటల్లో నిలుస్తుంది. 

400 కు పైగా తెలుగు వారు న్యూయార్క్, న్యూజర్సీ, కనెక్టికట్ లతో పాటు అమెరికా లోని వివిధ రాష్ట్రాలనుంచి తెలుగువారు న్యూయార్క్ చేరుకున్నారు. క్షేమాన్ని, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులలో ఆడపడుచులు తాము తయారు చేసిన బతుకమ్మలతో, కుటుంబ సభ్యులతో  వేడుకలో పాల్గొన్నారు.

సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు  జరిగిన ఈ వేడుకలను తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ పండగను విశ్వవేదిక మీద జరుపుకోడం గర్వంగా ఉందని, మన తెలుగుజాతి సంస్కృతిని ప్రపంచానికి తెలియజేశామన్నారు. ఈవేడుకలో తెలుగువారందరికి సమాచారం అందించి వారందరిని సమనవ్య పరిచి ఈ ఉత్సవం విజయవంతం చేయటంలో కీలక పాత్ర వహించిన తానా కల్చరల్ కొఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల కృషిని అభినందించారు. 

తానా పూర్వ అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలు టైమ్ స్క్వేర్ ని వైవిధ్య భరితమైన పూలవనంగా మార్చాయి. ఈసందర్భంగా జయశేఖర్ మాట్లాడుతూ మన సంప్రదాయంలో దేవుళ్ళని పూలతో పూజించే మనం, ఈ పండగకిమాత్రం పూలనే దేవుళ్లుగా చేసి పూజించటం లోని విశిష్టతను తెలియ జేశారు.  

ప్రెసిడెంట్ ఎలెక్ట్ నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ తానా వినూత్నమైన కార్యక్రమాలు చేస్తుంది అన్న తమ మాటని ఋజువుచేసుకుంటూ ఇంకా సంస్థ ప్రతిష్ట ని పెంచే కార్యక్రమాలు చేపడతామన్నారు.

అమెరికాలోని వివిధ నగరాలనుంది విచ్చేసిన  సంస్థ సెక్రెటరీ సతీష్ కుమార్ వేమూరి, కోశాధికారి అశోక్ కొల్లాల తో బాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, బోర్డు ఆఫ్ ట్రస్టీ లు, ఫౌండేషన్ ట్రస్టీలు ఈ పండగ తెలుగు వారి సంప్రదాయాలని ప్రపంచానికి చాటిచెప్తుంది అన్నారు. ఈ కార్యక్రమాన్ని న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్టానా జట్లు సమన్వయం చేశాయి. 20 అడుగుల బతుకమ్మని పేర్చడానికి కృషి చేసిన న్యూజేర్సీ BOD లక్ష్మి దేవినేని గారిని అభినందించారు. బ్రూక్లీన్ బరో ప్రెసిడెంట్ ఆఫీసు ప్రతినిధి గా విచ్చేసిన దక్షిణ ఆసియా విషయాల డైరెక్టర్ దిలీప్ చౌహాన్, తెలుగు సంస్కృతిని చాటి సేవ చేస్తున్న తానాకి మేయర్ ద్వారా జారీ చేయబడిన అభినందన పత్రాన్ని అందించారు.  న్యూజర్సీ యుటిలిటీస్ కమిషనర్  చివుకుల ఉపేంద్ర తానా కృషిని అభినదించి తెలుగు వారికి ఎలాంటి అవసరాలున్నా తాము అండగా ఉంటాము అని హామీ ఇచ్చారు.  వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు కూడా హాజరై తానా చేసిన ఈ బృహత్కార్యక్రమాన్ని ప్రశంసించారు.

వేదిక పరిసరాలలో ఎటు చూసినా రంగు రంగుల పూలు, పూలతో పోటీపడుతూ పట్టు చీరలలో వెలిగిపోతూ, సాంప్రదాయం బద్ధమైన  అలంకారాలతో  తెలుగుదానం ఉట్టి పడుతున్న తెలుగు ఆడపడుచుల ఉత్సాహభరితమైన బతుకమ్మ పాటలు, నృత్యాల తో టైమ్ స్క్వేర్ తెలుగు రాష్ట్రాల లో జరిగే వేడుకలనుమరపించింది. వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన సభ్యులు సంప్రదాయ నృత్యాలు, మహిషాసుర మర్ధిని నృత్య రూపకం, చిన్నారుల జానపద నృత్యాలను ప్రదర్శించి ఆహూతులని ఆనందింపజేశారు. కార్యవర్గం ఆహూతులకు తెలుగు వంటకాలతో కమ్మని విందు అందించారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా సభ్యులంతా పెద్ద సంఖ్యలో హాజరై ఆటపాటలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని లైవ్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేసిన TV9 కి  తానా నేతలు కృతజ్ఞతలు అందజేశారు. ఇంతటి మహా కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడానికి వారాల తరబడి కృషి చేసిన వాలంటీర్లకు ధన్యవాదాలు తెలియజేశారు.

Click here to Event Gallery Par 1

Click here to Event Gallery Part 2

Tags :