ASBL Koncept Ambience
facebook whatsapp X

రివ్యూ : 'డబుల్ ఇస్మార్ట్' హే నారాయణ్! హే పూరీ జగన్నాధ్!! తెరేకు ఖ్యా హువా!!!  

రివ్యూ : 'డబుల్ ఇస్మార్ట్' హే నారాయణ్! హే పూరీ జగన్నాధ్!! తెరేకు ఖ్యా హువా!!!  

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : పూరి కనెక్ట్స్
నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను, టెంపర్ వంశీ, మకరంద్‌ దేశ్ పాండే తదితరులు.
సంగీత దర్శకుడు : మణి శర్మ; సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి
ఎడిటింగ్ : జునైద్; స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
విడుదల తేదీ : 15.08.2024

ఉస్తాద్ రామ్ పోతినేని, న్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా  పూరీ కనెక్ట్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అయింది. ఇస్మార్ట్ శంకర్ అయితే మాస్ ఆడియెన్స్‌కు బాగానే ఎక్కేసింది. మరి ఈ డబుల్ ఇస్మార్ట్ కూడా అలానే హిట్ అవుతుందా? పూరి, రామ్‌కి మళ్లీ బ్లాక్ బస్టర్ వచ్చిందా? నిర్మాతగా ఛార్మీ దశ తిరిగిందా? అన్నది
సమీక్షలో  చూద్దాం.

కథ:

ఇక ఈసారి కథ లోకి వస్తే.. ఇంటర్నేషనల్ గా పేరు మోసిన మాఫియా డాన్, మేజర్ గా గన్స్ సప్లై చేసే బిగ్ బుల్ (సంజయ్ దత్) కి  బ్రెయిన్ ట్యూమర్ ఉండటంతో, మూడు నెలల్లో చనిపోతాని తెలుసుకుంటాడు. తాను చిరకాలం బతకాలని కోరిక ఉండటం, బిగ్ గోల్‌‌తో బతకాలని అనుకుంటాడు. దీని కోసం తన మెమోరీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని)కి ఆల్రెడీ మెమోరీ ట్రాన్స్‌ఫర్మేషన్ సక్సెస్ అయిందని, అతనిలో తన మెమోరీస్ జొప్పించాలని, ఇస్మార్ట్ శంకర్ రూపంలో తాను మళ్లీ బతకాలని కోరుకుంటాడు. దీంతో ఇస్మార్ట్ శంకర్ కోసం తన గ్యాంగ్‌ను దింపుతాడు. ఇస్మార్ట్ శంకర్ సైతం బిగ్ బుల్‌ మనీని కొల్లగొడుతుంటాడు. ఈ క్రమంలో జన్నత్ (కావ్యా థాపర్) కూడా ఇస్మార్ట్ శంకర్‌తో చేతులు కలుపుతుంది. ఇస్మార్ట్ శంకర్ సైతం తన టార్గెట్ బిగ్ బుల్ అని చెబుతుంటాడు. ఇస్మార్ట్ శంకర్‌కు మోమోరీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసేందుకు బిగ్ బుల్ చేసిన ప్రయత్నాలు ఏంటి? ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగిన తరువాత ఏర్పడిన పరిణామాలు ఏంటి? బిగ్ బుల్‌ను పట్టుకునేందుకు రా ఏం చేసింది? ఈ కథలో జన్నత్ పాత్ర ఏంటి? పోచమ్మ (ఝాన్సీ) కారెక్టర్‌కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? చివరకు ఏం జరుగుతుంది? అన్నది తెరపై చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు :

డబుల్ ఇస్మార్ట్ విషయంలో రామ్ ఎనర్జీ తోనే చిత్రం నడుస్తుంది. మొదటి చిత్రంలోలాగా మళ్లీ అదే యాసలో తెలంగాణ భాషను కీమా కొట్టేశాడు. కావ్యా థాపర్‌ను హీరోయిన్‌గానే కాకుండా.. ఐటం సాంగ్‌లకు కూడా వాడుకున్నట్టుగా అనిపిస్తుంది. సంజయ్ దత్ ఉన్న చోట నుంచి సరిగ్గా కదల్లేక కష్టపడ్డట్టుగా కనిపిస్తుంది. సంజయ్ దత్ రోల్ ఇంకా పెద్ద డిజప్పాయింటింగ్ అని చెప్పాలి. సినిమాలో తన రోల్ చాలా అసహజంగా అనిపిస్తుంది. తన పర్సనాలిటీకి తను చేసే పనులు నటన అంత ఇంట్రెస్ట్ గా ఏమి కనిపించవు. సాయాజీ షిండే పాత్రను చూస్తే నవ్వొస్తుంది. ఇతను రా హెడ్డా? మరొకటా? అనే  అనుమానం వస్తుంది. రా చీఫ్, రా ఉద్యోగులు అంత సిల్లీగా ఉంటారా? అని అనిపించేలా పూరి  ఆ  పాత్రను డిజైన్ చేశాడు దర్శకుడు . అసలు ఈ సినిమాకు మదర్ సెంటిమెంట్‌ను అద్దే ప్రయత్నం చేశాడు. కానీ ఏ కోశాన కూడా మదర్ సెంటిమెంట్ బేస్డ్ సినిమాగా అనిపించదు. పైగా అది సెంటిమెంట్ అని ఎక్కడా కూడా అనిపించదు. అది చాలదనుకుంటే?..  ప్రగతి పాత్రతో పూరి విసిగించాడు. ప్రగతి నటనను చూసినా, ఆమె డైలాగ్స్ చెప్పినా .. ఎందుకు ఈ ఓవర్ యాక్షన్ అన్నట్టుగా కనిపిస్తుంది. గెటప్ శ్రీను ఓకే అనిపిస్తాడు. టెంపర్ వంశీ మూడు, నాలుగు సీన్లలో మెప్పిస్తాడు. గుర్భానీ పాత్ర పర్వాలేదనిపిస్తుంది. మకరంద్‌ దేశ్ పాండేకు సరైన కారెక్టర్ పడలేదనిపిస్తుంది. ముఖ్యంగా అలీ చేత చేయించిన బోకా అనే కామెడీ ట్రాక్ చెత్తగా అనిపిస్తుంది. అలీని అలా ప్రేక్షకుడు చూడలేకపోతాడు. ఒకటి, రెండు సార్లు అంటే బాగుంటుందేమో కానీ పదే పదే తెరపై కనిపించడంతో విసుగు వస్తుంది. ఆ ట్రాక్ ఏ ఒక్క చోట కూడా నవ్వించదు. పూరి  రైటింగ్ ఎంతగా పడిపోయింది.. ఎంత సిల్లీగా ఉంటుందని చెప్పడానికి ఆ ట్రాక్ ఒక్కటి చాలనిపిస్తుంది.

సాంకేతికవర్గం పనితీరు:

పూరి ప్రస్తుతం ఫాం కోల్పోయాడన్న సంగతి తెలిసిందే. సరైన హిట్టు కొట్టేందుకు చాలానే ప్రయత్నిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ మాస్ ఆడియెన్స్‌కి ఎక్కడంతో బాక్సాఫీస్ వద్ద గట్టెక్కింది మాస్ ఆడియెన్స్ పుణ్యమా అని సూపర్  హిట్టుగా నిలిచింది. ఆ తరువాత లైగర్ అంటూ పూరి చేతులు కాల్చుకున్నాడు. దీంతో మళ్లీ రామ్‌తో డబుల్ ఇస్మార్ట్ అని తీశాడు. ఇస్మార్ట్ శంకర్ లక్‌తో రామ్ తో  గట్టెక్కిందంటే.. మళ్లీ డబుల్ ఇస్మార్ట్ అని పూరి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సారి మాత్రం  సరైన కథను గానీ, కథనాన్ని కూడా రాసుకోలేదు. ఏదో హడావిడిగా చుట్టేసినట్టుగా కనిపిస్తుంది. ఇందులో చెప్పుకోవడానికి కూడా కథ ఏమీ ఉండదనిపిస్తుంది. నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా.. అంతర్యుద్దం, కల్లోలాలు సృష్టించడం అనే థాట్ ఎలా వచ్చిందో పూరికే తెలియాలి. మణిశర్మ వర్క్ జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. కొన్ని సీన్స్ బ్యాక్ గ్రౌండ్  స్కోర్ బాగుంది కానీ కొన్ని సీన్స్ లో మిస్ అయ్యింది. జునైద్ ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. కొన్ని సీన్స్ లో ఆడియో సింక్ కూడా మిస్ అయ్యింది. ఈ సినిమాలో ఛార్మి, పూరి జగన్నాథ్ ల నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా సెటప్, కావాల్సిన సెట్టింగ్ వర్క్స్ బాగున్నాయి.

విశ్లేషణ: 

అసలు లైగర్ ఫ్లాప్ తరువాత పూరి ఎంత కసితో సినిమా తీసి ఉంటాడా? అని అనుకుని ఆశగా చూసే అభిమానులకు మళ్లీ నిరాశే కలుగుతుంది. మాస్ హిట్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం దానికి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనుకుంటే ఫిఫ్టీ పెర్సెంట్  కూడా రీచ్ కాలేకపోయింది అని చెప్పొచ్చు. లిమిటెడ్ గా కనిపించిన మాస్ మూమెంట్స్ ఓకే, రామ్ తన రోల్ ని బాగానే చేసేసాడు. కావ్య కూడా బాగానే కనిపించింది కానీ పూరి వర్క్ మాత్రం అంచనాలు రీచ్ అయ్యే రేంజ్ లో లేదు. ఇస్మార్ట్ శంకర్ చూసి దీనిపై ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే తప్పకుండా డిజప్పాయింట్ అవుతారు. ఎంత తక్కువ అంచనాలు పెట్టుకొని చూసినా ఇస్మార్ట్ శంకర్ వెయ్యి రేట్లు బెటర్ అనిపిస్తుంది. ఈ  సినిమా మాత్రం  బిలో యావరేజ్ గానే మిగిలిపోయింది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :