ASBL Koncept Ambience
facebook whatsapp X

Volunteers: వాలంటీర్లకు త్వరలో గుడ్ న్యూస్..!?

Volunteers: వాలంటీర్లకు త్వరలో గుడ్ న్యూస్..!?

ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ (YCP) ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ (Volunteer system) పెద్ద సంచలనం అనే చెప్పొచ్చు. గ్రామ, వార్డు సచివాలయాలకు (Village secretariat) అనుబంధంగా వాలంటీర్లను (Volunteers) నియమించింది జగన్ (YS Jagan) ప్రభుత్వం. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతి 75 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించింది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్ల పాత్ర మరువలేనిది. పెన్షన్ల (pensions) మొదలు ప్రభుత్వ స్కీంల (Govt Schemes) వరకూ అన్నింటికీ అనుసంధానకర్తలుగా వాలంటీర్లు పని చేశారు. వీళ్లకు రూ.5వేలు చొప్పున భృతి ఇచ్చేవారు. అయితే ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థపై అనేక విమర్శలు తలెత్తాయి.

వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా పని చేస్తున్నారని.. వాళ్లను తప్పించాలని కూటమి పార్టీలు డిమాండ్ చేశాయి. ఎన్నికల కమిషన్ (Election Commission) కూడా వాళ్లను ప్రధాన విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించింది. దీంతో వాలంటీర్ వ్యవస్థకు కూటమి పార్టీలు వ్యతిరేకమని.. కూటమి గెలిస్తే వాలంటీర్లను తొలగిస్తారని వైసీపీ (YCP) ప్రచారం చేసింది. అందుకే కూటమి పార్టీలకు వ్యతిరేకంగా రాజీనామాలు చేయాలని వైసీపీ పిలుపునిచ్చింది. దీంతో దాదాపు లక్ష మందికి పైగా వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. అయితే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని.. పైగా రూ.10వేలు భృతి ఇస్తామని కూటమి పార్టీలు (NDA Alliance) హామీ ఇచ్చాయి.

ఇలా పార్టీల ఎత్తుకు పైఎత్తుల్లో వాలంటీర్లు సతమతమయ్యారు. చివరకు వైసీపీ ఓడిపోయి కూటమి అధికారంలోకి వచ్చింది. రాజీనామాలు చేసిన వాలంటీర్లు తప్పయిపోయిందని, తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. పైగా తమచేత కొంతమంది వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు (resignations) చేయించారంటూ ఫిర్యాదులు చేశారు. మరోవైపు కొనసాగుతున్న లక్ష 65వేల మంది వాలంటీర్లు తమకు రూ.10వేల భృతి ఇస్తారని ఆశించారు. అయితే వంద రోజులు దాటినా వాలంటీర్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా వాలంటీర్లు లేకుండానే గత మూడు నెలలుగా పెన్షన్లను ఒకటో తేదీనే సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేసింది ప్రభుత్వం.

దీంతో వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తారేమోననే అనుమానాలు మొదలయ్యాయి. అయితే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, రూ.10వేలు భృతి ఇస్తామని టీడీపీ మేనిఫెస్టోలో (TDP Manifesto) పెట్టింది. అంతేకాక అర్హులైన వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ (skill development) ద్వారా శిక్షణ ఇచ్చి మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో వాలంటీర్లను తప్పకుండా కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కొన్ని సర్దుబాట్లు చేసి వాలంటీర్ల సేవలను వినియోగించుకునే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబందించి పదో తేదీ జరిగే కేబినెట్లో (Cabinet meeting) కీలక నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :