రివ్యూ : “జనక అయితే గనక” కొత్త పాయింట్
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్థ : దిల్ రాజు ప్రొడక్షన్స్
నటినటులు:సుహాస్, సంగీర్థన,రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ తదితరులు
సంగీతం:విజయ్ బుల్గానిన్, సినిమాటోగ్రఫీ:సాయి శ్రీరామ్
ప్రొడక్షన్ డిజైనర్: అరసవిల్లి రామ్‌కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అకుల్
సమర్పణ: శిరీష్, నిర్మాత:దిల్ రాజు, హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి
దర్శకత్వం:సందీప్ రెడ్డి బండ్ల
నిడివి ; 2 ఘంటల18 నిముషాలు
సుహాస్ (Suhas). ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఉన్న సినిమాలను ఎంచుకోవడంతో ఆయనకు ఓ వర్గం ఆడియన్స్ ఫ్యాన్స్ గా కూడా మారిపోయారు. కాన్సెప్ట్ సినిమాలతో కథానాయకుడిగా మంచి ఫామ్ లో ఉన్న సుహాస్ నటించిన తాజా చిత్రం “జనక అయితే గనక” (Janaka Aithe Ganaka) . సుహాస్ ఓ సినిమా చేస్తున్నాడు అంటే… ఎలాగైనా చూడాల్సిందేే అని చాలా మంది అనుకుంటారు. అలాంటి సుహాస్ ఇప్పుడు దిల్ రాజు (Dil రాజు) బ్యానర్‌లో ఆయన కుమార్తె హన్షిత రెడ్డి (Hanshitha Reddy) నిర్మించడం విశేషం. జనక అయితే గనక అనే మూవీ చేస్తున్నాడు. ట్రైలర్‌లోనే సినిమా కథ ఏంటో మొత్తం చెప్పారు. కండోమ్ కంపెనీపైన కేసు వేసిన సుహాస్ అంటూ ప్రమోషన్స్ కూడా చేశారు. సినిమాపై మంచి హైప్ కూడా క్రియేట్ అయింది. ఈ చిత్రం విడుదల అక్టోబర్ 12న అయినప్పటికీ.. సినిమా మీద నమ్మకంతో ముందే ప్రీమియర్స్ వేశారు. మరీ ఈ హైప్‌తో థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్‌ను సుహాస్ మెప్పిస్తాడా ?… లేదా అనేది రివ్యూ లో చూద్దాం.
కథ:
అసలు కథ ఏంటో ట్రైలర్‌లోనే చూపించారు. సాధారణ మధ్యతరగతికి చెందిన ప్రసాద్ (సుహాస్)కి పెళ్లై చక్కని భార్య (సంగీర్తన) ఉంటుంది. వీళ్లిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు. ఒకరంటే ఒకరికి ఇష్టం ప్రేమ. కానీ ఆ ప్రేమను పిల్లల వరకూ వెళ్లనీయడు ప్రసాద్. పిల్లల్ని కంటే వాళ్లకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలని.. తాను కోల్పోయింది తనకి పుట్టే బిడ్డలు కోల్పోకూడదనే ఉద్దేశంతో సేఫ్టీ (కండోమ్) వాడుతుంటాడు ప్రసాద్. అయితే అనుకోకుండా తన భార్య నెలతప్పుతుంది. దాంతో ప్రసాద్.. ఆ కండోమ్ కంపెనీపై కేసు వేసి.. కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కోర్టుకి వెళ్తాడు. ఆ కేసు ద్వారా ప్రసాద్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అతని వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించింది? అతను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ ఏంటి? అన్నదే మిగిలిన కథ.
నటీనటుల హావభావాలు:
ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో సుహాస్ నిజంగానే తండ్రి అయ్యాడు. అందుకే ఈ కథకి అంతలా కనెక్ట్ అయ్యాడు అనుకుంట. భార్య నిండు గర్భిణిగా ఉన్నప్పుడు అతను చేసే సేవలు.. కడుపులోని బిడ్డ తన్నుతున్నప్పుడు అతను పొందే భావోద్వేగంతో నటించడం కాదు.. జీవించేశాడు. అసలు ఈ కథ సుహాన్‌ని తప్ప వేరే వాళ్లని ఊహించుకోలేం. ప్రసాద్ పాత్రలో మరోసారి వెర్సటైల్ యాక్టర్ అనిపించాడు సుహాస్. ‘పెళ్లైంది మరి పిల్లల్ని కనడానికి ఏ రోగంరా నా కొడకా’.. అని తండ్రి అడిగినప్పుడు.. అతన్ని స్కూటర్‌పై ఎక్కించుకుని.. హాస్పిటల్ మొదలు.. మెడికల్ కాలేజ్ వరకూ ఖర్చు ఎంత ఉంటుందో లెక్క కట్టి చూపిస్తే ప్రసాద్ తండ్రి (గోపరాజు రమణ) (Goparaju Ramana)కే కాదు.. సినిమా చూసే ప్రతి తండ్రికీ కళ్లు బైర్లు కమ్ముతాయి. వామ్మో ఇంత ఖర్చు ఉంటుందా? అని. హీరోయిన్ సంగీర్తన (Sangeerthana Vipin)ని ఏమే ఏమే అని పిలుస్తాడు ప్రసాద్. అదే ఆమె పేరు. ఏదైనా మా ఆయన చూసుకుంటాడు అని.. భర్తకి అండగా నిలిచే భార్య పాత్రలో ఒదిగిపోయిందామె.
లాస్ట్ కోర్ట్ సీన్‌లో ఆమె ఎంట్రీ సినిమాకే హైలైట్. ఒక సాధారణ మధ్యతరగతోడి భార్య ఎలాగైతే ఉంటుందో అలాగే కనిపించింది. ఖర్చుల విషయంలో ఈ మధ్య తరగతోడి పెళ్లం వెనకడుగు వేయొచ్చేమో కానీ.. ప్రేమను పంచే విషయంలో తగ్గేదేలే అనేట్టు చేసింది సంగీర్తన. సినిమాలో కనిపించేవి చాలా లిమిటెడ్ రోల్స్. హీరో, హీరోయిన్, పేరెంట్స్, బామ్మ, లాయర్, జడ్జీ.. వీళ్లే కనిపిస్తారు. కానీ ప్రతి పాత్రకు తగిన ప్రాధాన్యత కల్పించారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ అయితే.. లాయర్ పాత్రలో చాలా రోజుల తరువాత ఫుల్ లెంగ్త్ కామెడీతో పొట్ట చెక్కలు చేశారు.ఈ కేసుతో వెన్నెల కిషోర్ (Vennela Kishore).. కండోమ్ కిషోర్ అయిపోతాడు. జడ్జీగా రాజేంద్రప్రసాద్.(Rajendra Prasad). అదరగొట్టేశారు. చాలా ఏళ్ల తరువాత రాజేంద్ర ప్రసాద్ కామెడీ టైమింగ్ పండింది. జంధ్యాల సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గుర్తొస్తారు. కండోమ్ కంపెనీ తరుపున వాదించే క్రిమినల్ లాయర్‌గా మురళీశర్మ కీలక పాత్రలో కనిపించారు. అలాగే ప్రభాస్ శ్రీను (Prabhas Sreenu) కూడా లాయర్ పాత్రలో ఫన్ జనరేట్ చేశారు. అతనికి అసిస్టెంట్‌గా చేసిన సునీతకి కూడా ప్రాధాన్యత దక్కింది. సునీతపై వేసే పంచ్‌లు బాగా పేలాయి. కడుపుబ్బా నవ్వించాయి. ఇక సుహాస్ బామ్మగా నటించిన పెద్దావిడ అయితే అదరగొట్టింది.
సాంకేతిక వర్గం పనితీరు:
కథ విషయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల (Sandeep Reddy Bandla) వంద మార్కులు కొట్టేశాడు. సినిమాని చాలా కొత్తగా రాసుకున్నాడు. కాకపోతే ఫస్ట్ హాఫ్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. కొన్ని పాయింట్స్ మరీ ఫోర్స్డ్ గా ఉండటం కూడా కొందరిని ఇబ్బంది పెట్టచ్చు. బేబీ చిత్రంతో సంగీత దర్శకుడిగా సంచలనం అయిన విజయ్ బుల్గానిన్ మరోసారి తన మెలోడీతో మ్యాజిక్ చేశాడు. సినిమాకి విజయ్ బుల్గానిన్ (Vijay Bulganin) నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. కానీ, నా ఫేవరెట్ నా పెళ్ళాం అనే సాంగ్ అయితే.. ప్రతి భర్తకే కాదు.. భార్యకి కూడా విపరీతంగా నచ్చేస్తుంది. సాయి శ్రీరామ్ (Sai Sriram) సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. ఇక నిర్మాతలుగా దిల్ రాజు,(Dil Raju) హన్షిత రెడ్డి, (Hanishitha Reddy) హర్షిత్ రెడ్డి (Harishith Reddy)లకు ఈ పండక్కి కాసుల పంట కురిసినట్టే. అసలు దిల్ రాజు.. ఇలాంటి టిపికల్ సబ్జెక్ట్‌ని ఎంచుకోవడం.. కండోమ్ చుట్టూ అల్లిన కథపై నమ్మకం ఉంచడాన్ని బట్టి చూస్తే అతని జడ్జిమెంట్ మరోసారి తప్పలేదనిపిస్తుంది.
విశ్లేషణ:
ఒక్కోసారి ఒక చిన్న ఆలోచన ఒక మంచి కథను మార్గం అవుతుంది. అలాంటి ఒక ఐడియా డైరెక్టర్ కు వచ్చింది. ఒక కండోమ్ కంపెనీ మీద కేసు వేయడం అనే పాయింట్ చాలా కొత్తగా ఉంది. అయితే ఆ చిన్న ఆలోచనను పెద్ద కథగా మలచడంలోనే అసలు ప్రతిభ కనిపిస్తుంది. ఈ విషయంలో మంచి మార్కులే పడతాయి. అయితే అంత పర్ఫెక్ట్ గా ఉందా? అంటే చిన్న చిన్న మైనస్లు కూడా లేకపోలేదు. ఓవరాల్ ఎక్స్ పీరియన్స్ లో మాత్రం అంత పెద్ద మైనస్ లు కనిపించవు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఇలాంటి కథ యువతకు చాలా అవసరం. ప్రసాద్ లాగానే ఖర్చులకు భయపడి పిల్లలను కనకుండా ఉంటున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారికి ఈ సినిమా ఒక మెసేజ్ లా కూడా ఉపయోగపడుతుంది. అది మాత్రం ఇప్పుడు చెప్తే స్పాయిలర్ అవుతుంది. అందుకే మీరు సినిమా చూసి ముందుకెళ్ళండి కొత్త పాయింట్ చక్కటి చిత్రం.