ASBL Koncept Ambience
facebook whatsapp X

BJP: బీజేపీని ఆపేవారే లేరా..?

BJP: బీజేపీని ఆపేవారే లేరా..?

దేశవ్యాప్తంగా హర్యాణా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠకు ఇవాల్టితో తెరపడింది. వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. హర్యాణాలో బీజేపీ కచ్చితంగా ఓడిపోతుందని తేల్చి చెప్పాయి. జమ్ముకశ్మీర్ లో మాత్రం హంగ్ రావచ్చని చెప్పాయి. అయితే జమ్ముకశ్మీర్ లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని అంచనా వేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ సత్తా చాటింది. దీంతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు బీజేపీ సన్నద్ధమయ్యేందుకు సానుకూల వాతావరణం కలిగిందని చెప్పొచ్చు.

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది బీజేపీ ఆలోచన. ఇందుకోసం చాలాకాలంగా బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ కావడంతో అన్నింటినీ చక్కబెట్టుకుంటూ ముందుకు వెళ్లాలనుకుంది. అందులో భాగంగానే మాజీ రాష్ట్రపతి రామనాథ్ గోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి జమిలి ఎన్నికలపై అధ్యయనం చేయించింది. ఇటీవలే ఆ కమిటీ నివేదిక సమర్పించింది. దాన్ని కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించింది. దీంతో ఈసారి కచ్చితంగా జమిలి ఎన్నికలు జరుగుతాయని అందరూ ఓ అంచనాకు వచ్చారు.

అయితే హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే జమిలి ఎన్నికలకు బ్రేక్ పడుతుందని అంచనా వేశారు. అందుకే బీజేపీ ఎత్తులను చిత్తుచేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి హర్యానా, జమ్ముకశ్మీర్ లో గట్టిగా పోరాడింది. సర్వేలన్నీ హర్యానా హస్తం పార్టీదే అని ఘంటాపథంగా చెప్పడంతో ముందస్తు సంబరాలు కూడా చేసుకుంది కాంగ్రెస్. జమ్ముకశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తుపెట్టుకుని కాంగ్రెస్ పోటీ చేసింది. అక్కడ ఆ కూటమికి క్లియర్ కట్ మెజారిటీ దక్కింది. అయితే ఇక్కడ కూడా బీజేపీకి గణనీయమైన స్థానాలు దక్కాయి.

బీజేపీది కాదనుకున్న హర్యానాలో ఆ పార్టీ హ్యాట్రిక్ కొట్టింది. కమలం పార్టీకి ఏమాత్రం గెలుపు అవకాశాలు లేవని అందరూ అనుకుంటున్న వేళ ఆ పార్టీ దాదాపు 50 సీట్లు గెలుచుకుని అధికారాన్ని చేపట్టబోతోంది. ఇది అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఫలితాలు కచ్చితంగా బీజేపీలో జోష్ నింపాయి. త్వరలో జరగనున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు ఈ ఫలితాలు కచ్చితంగా దోహదపడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఇదే జోష్ వచ్చే ఎన్నికల్లో కూడా కొనసాగితే జమిలి ఎన్నికలపై బీజేపీని అడ్డుకునే వారే ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :