ASBL Koncept Ambience
facebook whatsapp X

రివ్యూ : 'కంగువ' ఓ డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్

రివ్యూ : 'కంగువ' ఓ డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్థలు : స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్
నటీనటులు : సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్, కార్తీ, తదితరులు
సంగీతం : రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, ఎడిటర్ : నిశాద్ యూసుఫ్
సినిమాటోగ్రఫీ : వెట్రి పళనిస్వామి, యాక్షన్ : సుప్రీమ్ సుందర్
మాటలు  :మదన్ కార్కే, కథ : శివ, ఆది నారాయణ
కాస్ట్యూమ్ డిజైనర్ : అను వర్థన్, దష్ట పిల్లై
కాస్ట్యూమ్స్ : రాజన్, కొరియోగ్రఫీ : శోభి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత : ఏ జే రాజా, సహా నిర్మాత : నేహా జ్ఞానవేల్ రాజా
నిర్మాతలు : కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్, దర్శకత్వం : శివ
విడుదల తేదీ : 14.11.2024
నిడివి : 2 ఘంటల 33 నిముషాలు

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. దర్శకుడు శివ ఇంత వరకు రొటీన్ చిత్రాలతోనే తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ వచ్చాడు. మొదటి సారి శివ తనలోని టెక్నికల్ నాలెడ్జ్, పాన్ ఇండియన్ విజన్‌ను 'కంగువ' (KANGUVA)తో స్టార్ట్ చేసాడు. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందొ సమీక్ష లో చూద్దాం.

కథ :

ఫ్రాన్సిస్ (సూర్య)(Suriya) బౌంటీ హంటర్ (కిరాయికి ఏపనైనా చేసేవాడు) తీసుకుంటూ క్రిమినల్స్‌ను పట్టిస్తుంటాడు. గోవాలో జాలీ లైఫ్‌ను గడుపుతుంటాడు. మరో బౌంటీ హంటర్ ఎంజెల్‌ (దిశా పటానీ)తో బ్రేకప్ జరుగుతుంది. అయితే డబ్బు కోసం తాము ఒప్పుకొన్న పనులు చేసే క్రమంలో ఇద్దరు గొడవ పడుతుంటారు. ల్యాబ్ నుంచి జెటా అనే కుర్రాడు తప్పి పోయి ఫ్రాన్సిస్ వద్దకు వస్తాడు. ఆ కుర్రాడికి గత జన్మ స్మృతులు గుర్తుకు వస్తుంటాయి. ఇక ఆ కుర్రాడి కోసం ఓ చిన్న పాటి ఆర్మీ దిగుతుంది. ఆ పిల్లాడేమో ఫ్రాన్సిస్ వద్దకు వస్తాడు. అందులో ప్రణవాది కోన యువరాజు కంగువా (సూర్య), ప్రణవ అనే కుర్రాడిని కాపాడే బాధ్యతను ఎందుకు తీసుకుంటాడు? అయితే ఇంతకు కంగువ ఎవరు? జెటాకు కంగువకు ఉన్న రిలేషన్ ఏమిటి?  వెయ్యేళ్ల క్రితం జరిగిన కథతో వీరిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? ప్రణవాది కోన, కపాల కోన, అరణ్య కోన, హిమ కోన, సాగర కోన మధ్య జాతి పోరాటం ఏమిటి? ప్రణవాది కోనకు చెందిన కంగువాకు కపాల కోనకు చెందిన రుధిర నేత్ర (బాబీ డియోల్‌) వైరం ఏమిటి? ఐదు కోనల మధ్య రుమేనియా ఎందుకు చిచ్చు పెట్టానుకొన్నది. కంగువకు రుధిర వర్గాల జాతి, ప్రాంత ఆధిపత్య పోరాటం ఎందుకు వచ్చింది? కపాల కోన జాతిపై కంగువ ఎలాంటి ప్రతీకారం తీర్చుకొన్నాడు? అసలు పంచ కోన కాన్సెప్ట్ ఏంటి?  చివరకు కంగువా తన బాధ్యతను పూర్తి చేశాడా? చివర్లో ఎంట్రీ ఇచ్చిన రుద్రాంగ నేత్రుడు (కార్తీ) చేసిన శపథం ఏంటి? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు : 

నటుడిగా సూర్య మరో మెట్టు ఎక్కుతాడనిపిస్తుంది. సినిమాలో చాలా చోట్ల క్లోజప్ షాట్స్‌తో సూర్య అదరగొట్టేస్తాడు. సూర్య కంటితోనే నటించేస్తాడని చెప్పాల్సిన పని లేదు. ఎప్పటిలానే తన నటన, ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. ఫ్రాన్సిస్, కంగువగా ఈ సినిమాలో రెండు పాత్రల్లో ఒదిగిపోయాడు. సూర్య వన్ మెన్ షో అని కూడా చెప్పుకోవచ్చు. పిల్లాడి పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. ఆ కుర్రాడు కూడా బాగానే నటించాడు. మిగిలిన పాత్రల్లో నటించిన వారు ఎవరో కూడా అంతగా గుర్తించలేం.. వారి పాత్రలు, నటన కూడా అంతగా గుర్తుండకపోవచ్చు. ఇక దిశా పటానీ కేవలం గ్లామర్‌కే పరిమితమైంది. బాబీ డియోల్ మరోసారి క్రూరమైన విలన్‌గా ఆకట్టుకొన్నాడు. అంతా సూర్యనే ఉండటం వల్ల ఆ షాడోలో బాబీ డియోల్ క్యారెక్టర్ పెద్దగా ఎలివేట్ కాలేకపోయిందనిపిస్తుంది. ఇద్దరు బాలనటులు కథకు బలమైన పాత్రలుగా నిలిచాయి. మిగితా పాత్రల్లో నటించిన వారాంత ఫర్వాలేదనిపించారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

కంగువ సినిమాకు అత్యంత బలం సాంకేతిక నిపుణుల పనితీరు. టెక్నికల్‌గా కంగువా అబ్బుర పరుస్తుంది. విజువల్స్, ఆర్ట్ వర్క్ అదిరిపోతుంది. దేవీ శ్రీ ప్రసాద్ ఒకటే ఊక దంపుడు దంచినట్టుగా అనిపిస్తుంది. ఎక్కడా మొదలు పెట్టి.. ఎక్కడా ఆపాలో మర్చిపోయినట్టుగా ఆర్ఆర్‌తో తలనొప్పి పుట్టిస్తాడు. కానీ కొన్ని చోట్ల దేవీ ఆర్ఆ‌ర్‌తో అద్భుతంగా సన్నివేశాలను ఎలివేట్ చేసినట్టు అనిపిస్తుంది. కంగువా కథ కోసం శివ భారీగానే ఖర్చు పెట్టించాడని చూస్తేనే తెలుస్తోంది. పళనిస్వామి సినిమాటోగ్రఫి ఈ సినిమాను మరింత రిచ్‌గా మార్చింది. అందమైన లోకేషన్లు ఈ సినిమాను అందంగా మార్చింది. అయితే ఎడిటింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు ఇంకా స్కోప్ ఉందనిపిస్తుంది. జ్ఞానవేల్ రాజా నిర్మాణ సారథ్యంలో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ : 

కంగువ సినిమా ప్రస్తుతం కాలమానంలో ఫ్రాన్సిస్.. 1070 సంవత్సరంలో కంగువ పోరాటం నేపథ్యంగా సమాంతరంగా కథ నడుస్తుంటుంది. దర్శకుడు కథకు మంచి బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకొన్నాడు. కానీ పాత్రల చిత్రీకరణ, సన్నివేశాలు ఈ జనరేషన్ ఆడియెన్స్ నచ్చే విధంగా సులభంగా అర్దమయ్యేలా, సరళీకృతంగా స్టోరీ నేరేషన్ చెప్పి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇక మితీమీరిన యాక్షన్, అరిచి గోల పెట్టే డైలాగ్స్ కొంత వరకు భరించవచ్చేమో కానీ.. సినిమా మొదలైన తొలి సన్నివేశం నుంచి చివరి సీన్ వరకు అదే విధంగా ఉండటం భరించలేని విషయం.కంగువా కథను చాలా సింపుల్‌గానూ చెప్పొచ్చు. అదే పాయింట్‌ను ఎంత గ్రాండియర్‌గా అయినా చెప్పొచ్చు. ఇలా కథను చాలా పెద్దగా చెప్పాలని అనుకున్నప్పుడు ఎలాంటి గందరగోళం లేకుండా క్లారిటీతో, క్లియర్‌గా చెబితే అందరికీ అర్థం అవుతుంది. పైగా ఆ గెటప్స్‌లో ఎవరు? ఏంటి? ఎవరు.. ఎవర్ని నరికేస్తున్నారో కూడా తెలియ కుండా పోతుంది. సామాన్య ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే అంశాలు లేకపోవడం ఈ సినిమాకు మైనస్. అయితే బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకొనే యాక్షన్ సన్నివేశాలు ఈ మూవీలో పుష్కలంగా ఉన్నాయి.  కంగువ కథ కోసం శివ భారీగానే ఖర్చు పెట్టించాడని చూస్తేనే తెలుస్తోంది. మరీ ఆ బడ్జెట్‌ను రికవరీ చేస్తుందా? లేదా అన్నది చూడాలి. రెండో పార్ట్ కోసం మంచి పాయింట్‌ను పట్టుకున్నాడనిపిస్తోంది. కార్తీ, సూర్యల వార్‌ను రెండో పార్ట్‌లో శివ భారీ స్థాయిలోనే ప్లాన్ చేసినట్టుగా ఉన్నాడు. మరి రెండో పార్టుని శివ ఎప్పుడు వదులుతాడో చూడాలి. భారీ అంచనాలతో వెళితే కొంత నిరాశ చెందవచ్చు. సూర్య, బాబీ డియోల్ అభిమానులకు నచ్చే అవకాశం ఉంది. ఓ డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ పొందాలనుకొనే వాళ్లు ఈ వారం ఈ మూవీని ఎంచుకోవచ్చు.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :