టాంప లో ఘనంగా సంబరాల గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఘనంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు టాంప లో శంఖారావం పూరించింది. గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ ఏవీ ద్వారా సంబరాలు ఎలా జరగనున్నాయనేది చాటిచెప్పింది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు, స్థానిక తెలుగు కళాకారులతో నృత్య ప్రదర్శనలు.. మ్యూజిక్ షోలతో టంపాలో తెలుగువారికి గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ మంచి కిక్ ఇచ్చింది. వచ్చే జులై 4, 5, 6 తేదీల్లో జరగనున్న అమెరికా తెలుగు సంబరాలకు ట్రైలర్‌లా కిక్ ఆఫ్ ఈవెంట్ జరిగింది. దాదాపు 1500 మంది తెలుగువారు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. టాంప లో జరగనున్న అతి పెద్ద తెలుగు సంబరానికి అమెరికాలో ఉండే ప్రతి కుటుంబం తరలిరావాలని నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ పిలుపు నిచ్చారు. తెలుగువారందరిని కలిపే వేదిక.. తెలుగువారికి సంతోషాలు పంచే వేదిక అమెరికా తెలుగు సంబరాలు అని ఈ అవకాశాన్ని ప్రతి తెలుగు కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని కోరారు. తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథ మహారథులు, సినీ స్టార్లు, సంగీత, సాహిత్య ఉద్దండులు, కళాకారులు పాల్గొనే సంబరాల్లో అమెరికాలో ఉండే తెలుగువారంతా పాల్గొనాలని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి పిలుపునిచ్చారు. టాంప సంబరాల గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్‌కు నాట్స్ జాతీయ నాయకులు కూడా తరలివచ్చారు.
స్థానిక డ్యాన్స్ స్కూల్స్ సబ్రిన (గణేశస్తోత్రం, కౌత్వం) , సరయు, లీలా టాలీవుడ్ లేడీస్ డాన్స్, మాధురి (తిల్లానా), శివం గర్ల్స్, సరయు(తమన్ మెడ్లీ), సబ్రిన(అన్నమయ్య కీర్తన),శివం(మస్తీ) చేసిన డ్యాన్స్ అందరిలో ఉత్సాహం నింపింది. సాకేత్ కొమాండూరి, మనీషా ఈరబత్తిని, శృతి రంజనీలు తమ గాన మాధుర్యంతో చక్కటి తెలుగుపాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. సాహిత్య వింజమూరి తన యాంకరింగ్ తో ఈ ఈవెంట్‌లో మెప్పించారు. ఈ సారి టాంపాలో జరిగే సంబరాల ప్రత్యేకత ఏమిటీ అనే దానిపై రూపొందించిన ట్రైలర్ ని ముఖ్యఅతిథిగా విచ్చేసిన తమన్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అందరిని ఆకట్టుకుని సంబరాలపై అంచనాలను పెంచింది. చక్కటి తెలుగు ఇంటి భోజనం కూడా గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్‌కు వచ్చిన తెలుగువారి చేత ఆహా అనిపించింది.
అనంతరం, నాట్స్ బోర్డ్ సెక్రటరీ మధు బోడపాటి, నాట్స్ గౌరవ సభ్యులను, గత అధ్యక్షులను, డైరెక్టర్స్ ను వేదికపైకి ఆహ్వానించారు.
టాంప నాట్స్ నాయకులు రాజేశ్ కాండ్రు నాట్స్ చాప్టర్ల నాయకులను, కార్యవర్గ సభ్యులను వేదిక మీదకు ఆహ్వానించారు. అలాగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో పాలుపంచుకునే టాంప స్థానిక తెలుగు సంఘలైన టీఏఎఫ్, మాటా, టీజీఎల్‌ఎఫ్, టీటీఏ, ఎఫ్ఐఏ, హెచ్‌టీఎఫ్‌ఎల్, సస్త, ఐటీ సర్వ్ సంస్థల ప్రతినిధులను గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ వేదికపై పరిచయం చేశారు. గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్‌లో ముఖ్యగా టాంప లో స్థానిక కళాకారుల డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ వేదికపై థమన్‌తో పాటు ఈవెంట్‌కు వచ్చిన ప్రముఖులను నాట్స్ సత్కరించింది. నాట్స్ సభ్యులు, దాతల నుంచి అమెరికా తెలుగు సంబరాలకు 2.5 మిలియన్ డాలర్ల విరాళాలు ఇచ్చేందుకు హామీ లభించింది.