Pawan Kalyan : కేబినెట్లో దుమారం రేపిన పవన్ కామెంట్స్ ..!!
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా అంశాన్ని పట్టుకుంటే దాని అంతు తేల్చే వరకూ వదలరు. వైసీపీని అధఃపాతాళానికి తొక్కకపోతే తన పార్టీ జనసేన కాదని.. తనపేరు పవన్ కల్యాణే కాదని ఎన్నికల ముందు శపథం చేశారు. జగన్ ను ఓడించేందుకు ఎవరితోనైనా జట్టుకడతానని.. ఇంటికి పంపిస్తానన్ని ప్రతినపూనారు. అన్నట్టుగానే బీజేపీ, టీడీపీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి జగన్ ను ఓడించి ఇంటికి పంపించారు. పవన్ కల్యాణ్ కామెంట్స్ ను కొంతమంది లైట్ తీసుకుంటూ ఉంటారు కానీ దాని వెనుక ఎన్నో కారణాలుంటాయి. ఇప్పుడు ఆ విషయం మరోసారి రుజువైంది.
రెండ్రోజులుగా పవన్ కల్యాణ్ సోషల్ మీడియా పోస్టులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది వైసీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని.. అయినా పోలీసులు పట్టించుకోవట్లేదనేది పవన్ కల్యాణ్ ఆవేదన. ఇదే విషయాన్ని ఆయన హోంమంత్రి అనితను ఉద్దేశించి కూడా చెప్పారు. హోంమంత్రిగా అనిత ఇలాంటివాటిపై దృష్టి పెట్టాలన్నారు. ఒకవేళ తాను హోంమంత్రినైతే సీన్ మరోలా ఉంటుందని హెచ్చరించారు. అనితను పవన్ కల్యాణ్ అవమానించారంటూ కొంతమంది అలకబూనారు. అయితే ఇదే అంశంపై ఇవాళ కేబినెట్ మీటింగ్ లో హాట్ హాట్ గా డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది.
ఇటీవల తాను హోంమంత్రి అనితను ఉద్దేశించి మాట్లాడినా, పిఠాపురంలో పోలీసులపై మాట్లాడినా దానికి అర్థముందని పవన్ కల్యాణ్ కేబినెట్ లో క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికీ కొంతమంది వైసీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెడుతున్నారని.. అయినా పోలీసులు, అధికారులు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేపదే పోస్టులు పెడుతున్నా పోలీసులు చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడం ఎంతవరకూ కరెక్ట్ అని పవన్ ప్రశ్నించారు. ఇంట్లో మహిళలపై పోస్టులు పెడుతుంటే ఊరుకోవాలా.. అని అడిగారు. అంతేకాక.. వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన కొంతమంది అధికారులు, ఉద్యోగులు ఇప్పటికీ కీలక పోస్టుల్లో కొనసాగుతున్నారని.. ఇలాగైతే ఎలాగని నిలదీశారు. కొంతమంది ఎస్పీలకు ఫోన్ చేసినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందన్నారు.
కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత అధికారులను బయటకు పంపించేశాక సీఎం చంద్రబాబు కూడా సహచర మంత్రులకు క్లాస్ పీకారు. ఇప్పటికీ కొంతమంది మంత్రులు బాధ్యాతాయుతంగా వ్యవహరించట్లేదని.. అందుకే అక్కడక్కడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అధికారులను దారికి తీసుకురావాల్సిన బాధ్యత మంత్రులదేనన్నారు. అధికారులు మారకుంటే మనం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మంచిగా ఉండడం తప్పుకాదని.. అలాగని మెతకగా ఉండొద్దని హెచ్చరించారు. పనితీరు మెరుగుపర్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది మారట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుశా పవన్ కల్యాణ్ కామెంట్స్ పనిచేశాయో ఏమో... కేబినెట్ అలా ముగియగానే.. వర్రా దేవందర్ రెడ్డి అరెస్టు వ్వవహారంలో అలసత్వం ప్రదర్శించినందుకు కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుపై బదిలీ వేటు వేసింది.