భారత్‌లో అందరూ సమానులే... భాష పేరుతో వేరుగా చూడటం తప్పు... డల్లాస్ లో రాహుల్ గాంధీ
డల్లాస్‌లో ఎన్నారైలతో కాంగ్రెస్ అగ్రనాయకుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ, భారతదేశంలో ఉన్న అందరూ సమానులే అని, భాషలు, సంప్రదాయాలతో వేరుగా చూడటం మంచిది కాదని అన్నారు. మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్న ఆయన.. భాషలు, సంప్రదాయాల పేరుతో ఎవర్నీ వేరుగా చూసే పద్ధతిని మానుకోవాలన్నారు. ‘భారత జాతీయగీతం అన్ని రాష్ట్రాలను ప్రతిబింబిస్తుంది. సమానంగా చూపిస్తుంది. అంతేగానీ.. ఒక రాష్టం బెస్ట్.. మరో రాష్ట్రం సెకండ్ బెస్ట్ అని అందులో ఎక్కడా ఉండదు. ఈ గీతం మన దేశాన్ని రాష్ట్రాల సమాఖ్యగా చెబుతుంది. అప్పుడు ఒక రాష్ట్రం కంటే ఇంకో రాష్ట్రం ఎక్కువా కాదు.. తక్కువా కాదు. అలాగే భాష, సంప్రదాయాలు కూడా. తమిళం మాట్లాడేవారు మాకు నచ్చరు అని.. హిందీ మాట్లాడేవారే ఇష్టమని మనం చెప్పడం సరికాదు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘‘తెలుగునే తీసుకోండి.. మనం తెలుగు అని చెబుతున్నప్పుడు అది కేవలం భాష కాదు.. ఒక చరిత్ర, ఒక సంప్రదాయం, సంస్కృతి. హిందీతో పోలిస్తే తెలుగు భాష అంత ముఖ్యం కాదని ఒకవేళ ఆ రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పినట్లయితే.. వారిని మీరు అవమానించినట్లే..! అలా పోలుస్తూ.. తెలుగు చరిత్ర, అక్కడి సంప్రదాయం, సంస్కృతి, పూర్వీకులు ముఖ్యం కాదని మీరు చెప్పినట్లే..!’’ అని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. ఈ చిన్న తేడాను కొందరు అర్థం చేసుకోకపోవడం వల్లే భారత్‌లో దీనికోసం పోరాటం జరుగుతోందంటూ భారతీయ జనతా పార్టీపై రాహుల్ విమర్శలు గుప్పించారు.
అలాగే భారత రాజకీయాల్లో ప్రేమ, గౌరవం, వినయం వంటివి ఇప్పుడు లేవని అన్నారు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ అంటే ఒకే భావజాలం అని ఆర్‌ఎస్‌ఎస్ నమ్ముతుంది. కానీ, భారత్ అంటే భిన్న భావజాలం అని మేం విశ్వసిస్తున్నాం. అమెరికాలో మాదిరిగానే.. అందరికీ ప్రాతినిధ్యం ఉండాలని మేం కోరుకుంటాం. కులం, మతం, భాష, సంప్రదాయాలతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ కలలు కనేందుకు అర్హులే. కానీ, భారత్‌లో ఇప్పుడా పరిస్థితుల కోసం పోరాడాల్సి వస్తోంది. భారత ప్రధాని (మోదీ) రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని మొన్నటి ఎన్నికలతో (2024 సార్వత్రిక ఎన్నికలు) ప్రజలందరికీ అర్థమైంది’’ అని రాహుల్ విమర్శించారు. ‘‘మా రాజకీయ వ్యవస్థలో ప్రేమ, గౌరవం, వినయం వంటివి లేవు. రాజకీయ నాయకులు కులమతాలు, భాషలు, రాష్ట్రాలకు అతీతంగా అందరినీ ప్రేమించాలి. కేవలం శక్తిమంతులనే గాక, భారత్‌ను నిర్మించేందుకు ప్రయత్నించే అందరినీ గౌరవించాలి. వీటన్నిటిని రాజకీయాల్లో తిరిగి తీసుకొచ్చేందుకే నేను నిరంతరం పనిచేస్తున్నా’’ అని రాహుల్ గాంధీ వెల్లడించారు.
ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి సొంతంగా మెజార్టీ దాటలేకపోయిన అంశాన్ని రాహుల్ పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘‘మన సంప్రదాయాలు, భాషలపై భాజపా దాడి చేస్తోందని నాతో చాలా మంది చెప్పారు. ఆ పార్టీ ఎలాంటిదో వారు అర్థం చేసుకున్నారు. భాజపా, ప్రధాని అంటే ఇప్పుడు ఎవరూ భయపడట్లేదని ఎన్నికల ఫలితాలతోనే స్పష్టమైంది. రాజ్యాంగంపై దాడిని తాము ఎన్నటికీ అంగీకరించబోమని ప్రజలు స్పష్టంగా చెప్పారు’’ అని రాహుల్ అన్నారు. భారత్ జోడో యాత్ర తనను ఎంతగానో మార్చిందని కాంగ్రెస్ ఎంపీ తెలిపారు. ‘‘ఆ యాత్ర తర్వాత నా ఆలోచనా విధానం కొత్తకోణంలోకి మారిపోయింది. ప్రజలతో కొత్త బంధాన్ని ఏర్పరిచింది. ఆ యాత్రతో భారత రాజకీయాల్లో ప్రేమ అనే కొత్త అధ్యాయాన్ని తీసుకొచ్చాం’’ అని రాహుల్ ఈ సందర్భంగా తెలిపారు.