ASBL Koncept Ambience
facebook whatsapp X

రివ్యూ : కొత్త కాన్సెప్ట్ తో 'సింబా'

రివ్యూ : కొత్త కాన్సెప్ట్ తో 'సింబా'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థలు : సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్
నటీనటులు: జగపతి బాబు, అనసూయ, కస్తూరీ, దివి, శ్రీనాథ్, కబీర్ సింగ్,వ‌శిష్ట సింహా, అనీష్ కురువిళ్ళ తదితరులు
సంగీత దర్శకుడు: కృష్ణ సౌరభ్, సినిమాటోగ్రఫీ: కృష్ణ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్, నిర్మాతలు : సంపత్ నంది, రాజేందర్ రెడ్డి సంయుక్త.
దర్శకుడు: మురళీ మనోహర్ రెడ్డి
విడుదల తేదీ : 09.08.2024

జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మూవీ 'సింబా'. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ మూవీకి ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది క‌థ‌, డైలాగ్స్ అందించడం విశేషం. సంపత్ నంది, రాజేందర్ రెడ్డి సంయుక్త నిర్మాణంలో కొత్త దర్శకుడు మురళీ మనోహర్ రెడ్డి ఈ సింబా సినిమాని తెరకెక్కించాడు. మరి ఈ రోజు శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ కాంబి లో  హిట్ కొట్టారా? లేదా...  అనేది సమీక్ష లో చూద్దాం.

కథ:

అనుముల అక్షిక (అన‌సూయ‌) ఓ సాధార‌ణ స్కూల్ టీచ‌ర్‌. ఇంట్లో బొద్దింకకు కూడా హాని చేయని శాంతి స్వభావి. మరోవైపు తన భర్తకు యాక్సిడెంట్ లో కాళ్ళు పోవడంతో తనే ఇంటిని నడిపిస్తూ ఫ్యామిలీని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అలా ఉండగా అనుకోకుండా ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఈ మ‌ర్డ‌ర్ కేసును ఇన్వేస్టిగేట్ చేస్తోన్న జ‌ర్న‌లిస్ట్ ఫాజిల్‌తో (శ్రీనాథ్‌) పాటు అత‌డి ప్రియురాలు ఇష్ట (దివి) పోలీస్ ఆఫీస‌ర్ అనురాగ్ (వ‌శిష్ట సింహా) క‌ళ్ల ముందే మ‌రో వ్య‌క్తిని హ‌త్య చేస్తారు. మ‌ర్డ‌ర్స్ చేసే ముందు అక్షిక‌తో పాటు ఫాజిల్, ఇష్ట వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తారు. త‌న మ‌నుషుల‌ను చంపేసిన అక్షిక‌, ఫాజిల్‌పై ప‌గ‌  పెంచుకుంటాడు బిజినెస్‌మెన్ పార్థ (క‌బీర్‌సింగ్ దుహాన్‌). వారిని హ‌త్య చేసేందుకు త‌మ్ముడితో క‌లిసి ప్లాన్ వేస్తాడు. ఆ ఎటాక్‌లో పార్థ త‌మ్ముడు క‌న్నుమూస్తాడు. ఆ తర్వాత వీరిద్దరితో పాటు డాక్టర్ ఇరానీ(అనీష్ కురువిళ్ళ) లో అదే మార్పు వచ్చి.. ఈ ముగ్గురు కలిసి మరో వ్యక్తిని చంపేస్తారు ఈ హ‌త్య‌ల వెనుక ఎవ‌రున్నారు? అక్షిక‌, ఫాజిల్‌ల‌తో  డాక్ట‌ర్ ద్వారా ఈ హ‌త్య‌ల‌ను ఎవ‌రు చేశారు? త‌మ‌కు ఈ హ‌త్య‌ల‌తో సంబంధం లేద‌ని అక్షిక వాద‌న‌లో నిజం ఉందా? ఈ హత్యలకు పర్యావరణ ప్రేమికుడు పురుషోత్త‌మ్ రెడ్డికి (జ‌గ‌ప‌తిబాబు)ఉన్న సంబంధం ఏమిటి? ఈ వ‌రుస హ‌త్య‌ల వెనుక ఉన్న మిస్ట‌రీని అనురాగ్ ఎలా ఛేదించాడు అన్న‌దే సింబా మూవీ క‌థ‌.

నటీనటుల హావభావాలు:

ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు మెయిన్ రోల్ అంటూ ప్ర‌చారం చేసింది సినిమా యూనిట్‌. కానీ ఆయ‌న పాత్ర సెకండాఫ్‌లోనే సినిమాలో క‌నిపిస్తుంది.  జగపతి బాబు పర్యావరణ ప్రేమికుడిగా కొత్తగా నటించారు. జగపతి బాబు ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా ఉంది.  ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుడిగా ఆయ‌న చెప్పై డైలాగ్స్ ప‌ర్వాలేద‌నిపిస్తాయి. కీలక పాత్రలో అనసూయ ఆకట్టుకుంది. ఇటు ఓ మంచి టీచర్ గా, అటు పలు యాక్షన్ సీన్స్ లో వైల్డ్ గా ఆమె తన నటనతో అదరగొట్టేసింది.ఇక వసిష్ఠ సింహ సీరియస్ పోలీసాఫీసర్ పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. మరో కీలక పాత్రలో కనిపించిన శ్రీనాథ్ కూడా బాగా నటించాడు. హీరోయిన్ దివి ఆకట్టుకుంది. అనీష్ కురువిళ్ళ పాత్రను డిజైన్ చేసిన విధానం బాగుంది. గౌతమి, కస్తూరిలతో మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

మొదటి సినిమా అయినా దర్శకుడు మురళీ మనోహర్ రెడ్డి తన టేకింగ్ తో  ఆకట్టుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ మరియు జగపతి బాబు ట్రాక్, మరియు మెసేజ్ ని డీల్ చేసిన విధానం  మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. సెల్యులార్ మెమరీ, బయోలజికల్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్ తో వైల్డ్ రివేంజ్ స్టోరీ ప్లేతో సాగిన ఈ సింబా చిత్రంలో మొక్కలు నాటాలి అని పర్యావరణానికి సంబంధించిన ఓ మంచి మెసేజ్ తో కథ నడిపించడం బాగుంది. కథలో ఇంట్రెస్ట్ మెయింటైన్ చేసిన విధానం కూడా బాగానే ఉంది. మంచివాళ్ళు గా ఉన్న వ్యక్తులు సడెన్ గా అతి దారుణంగా ఎందుకు హత్యలు చేస్తున్నారు? పాయింట్‌గా చూసుకుంటే సింబా ఓ సాధార‌ణ రివేంజ్ స్టోరీనే . కానీ ఈ క‌థ‌ను మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ బ్యాక్‌డ్రాప్‌లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు ఇంట్రెస్టింగ్‌గా స్క్రీన్‌పై న‌డిపించ‌డంలో ద‌ర్శ‌కుడు కొంత వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడు.సైన్స్‌, ప‌ర్యావ‌ర‌ణం లాంటి రెండు భిన్న‌మైన అంశాల‌ను రివేంజ్ స్టోరీలో మిక్స్ చేస్తూ క‌న్వీన్సింగ్‌గా చెప్పాడు. అనే కోణాన్ని ఆసక్తికరంగానే ఎస్టాబ్లిష్ చేసాడు దర్శకుడు మురళి మనోహర్ రెడ్డి.  ఈ కథకు మూలకారకుడు అయిన ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ని అభినందించాల్సిందే!  ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించుకోవాల‌నే మెసేజ్‌కు బ‌యోలాజిక‌ల్ మెమోరీ అనే సైంటిఫిక్ అంశాల‌ను కమర్షియల్   సినిమా గా నిర్మించడం నిర్మాతల ఘట్స్ మెచ్చుకోవలసిందే! ఇక సంగీత దర్శకుడు కృష్ణ సౌరభ్ సమకూర్చిన పాటలు పరవాలేదు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది

విశ్లేషణ:

ప్ర‌స్తుతం సందేశాత్మ‌క సినిమాల‌ను తెర‌కెక్కించే విష‌యంలో ట్రెండ్ మారింది. ఆడియెన్స్‌కు క్లాస్ ఇస్తున్న‌ట్లుగా సీరియ‌స్‌గా సినిమా తీస్తే నిర్మొహ‌మాటంగా తిర‌స్క‌రిస్తున్నారు. సందేశానికి క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను జోడిస్తూ న‌వ్విస్తూనో... లేదంటే థ్రిల్లింగ్‌ను పంచుతూనో చెప్పేందుకు ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తోన్నారు. అయితే ఈ సినిమా విషయానికొస్తే...  కాన్సెప్ట్ కొత్త‌గా ఉన్న ట్రీట్‌మెంట్ విష‌యంలో కొన్నిసార్లు రొటీన్‌గా అడుగులు వేశారు మేక‌ర్స్‌. సీరియ‌ల్ కిల్లింగ్స్ వెనుక ఎవ‌రున్నార‌న్న‌ది ఈజీగానే ఊహించేలా ఉండ‌టం సినిమాకు మైన‌స్‌గా మారింది. ఐతే, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, కొన్ని లాజిక్ లెస్ అండ్ సిల్లీ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కాన్సెప్ట్ అండ్ మెసేజ్ మాత్రమే కనెక్ట్ అవుతుంది. కొత్తగా ఏదైనా కావాలనుకునేవారికి సినిమా నచ్చుతుంది.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :