నాష్‌విల్లీలో తానా మహిళా క్రికెట్ టోర్నమెంట్.. ప్రతిభ చూపిన క్రికెటర్లు
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ నాగ పంచుమర్తి ఆధ్వర్యంలో వివిధ నగరాల్లో తానా తరపున క్రీడా పోటీలను నిర్వహిస్తూ ప్రతిభను వెలికి తీస్తున్నారు. మొట్టమొదటిసారిగా తానా ఆధ్వర్యంలో నాష్ విల్లీలో మహిళా ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను నిర్వహించి చరిత్ర సృష్టించారు. ఇది ఫ్రాంచైసీ టోర్నమెంట్ కావడం విశేషం. ఇండియాలో లాగా ప్రొఫెషనల్ స్థాయిలో మొట్టమొదటి ఉమెన్స్ ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప విషయమే. నాష్‌విల్లీ విమెన్ క్రికెట్ క్లబ్ తో సమన్వయం చేసుకొని తానా అపలాచియన్ విభాగం వారు ఈ విమెన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించారు. మహిళల క్రికెట్‌ను అభివృద్ధి చేయడంలో తానా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఈ టోర్నమెంట్ ద్వారా మహిళా క్రికెట్ ఆటగాళ్ల ప్రతిభ, అభిరుచి వెలుగులోకి వచ్చింది.
ఈ టోర్నమెంట్‌లో విజేతలుగా ఫ్రాంక్లిన్ రాయల్ ఛాలెంజర్స్ నిలిచాయి. ఈ టీమ్‌కు కెప్టెన్ - సీమా మాండ్లిక్, రన్నర్స్ అప్ గా మౌంట్జులియెట్ మావేరిక్స్ నిలిచింది. ఈ టీమ్ కు కెప్టెన్ గా ప్రతిమ వల్లెపల్లి వ్యవహరించారు. ఈ టోర్నమెంట్‌కు సమన్వయకర్తగా వైభవ్ గోయల్ ఉన్నారు. తానా నగర సమన్వయకర్త నవ్య కొల్లి, తానా అప్పలాచియాన్ ప్రాంతీయ ప్రతినిధి రాజేష్ యార్లగడ్డ, తానా క్రీడల సమన్వయకర్త నాగమల్లేశ్వర పంచుమర్తి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించారు.