అగ్నిప్రమాద బాధిత విద్యార్థులకు తానా-టీం స్క్వేర్ సహాయం
న్యూజెర్సీలోని బయోనే ప్రాంతంలోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఆరుగురు పేస్ యూనివర్సిటీ విద్యార్థులను ఆదుకునేందుకు తానా టీమ్ స్క్వేర్ ముందుకు వచ్చింది. వారికి సంబంధించిన సర్టిఫికెట్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. అలాగే ఒక విద్యార్థి ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాలిన గాయాలతో ఉన్న అతన్ని అగ్నిమాపక శాఖ సిబ్బంది ఆస్పత్రికి తరలించింది. ఈ విషయం తెలుసుకున్న తానా-టీం స్క్వేర్ కోచైర్ శ్రీనివాస్ భర్తవరపు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ భవనంలో ఉండే వారికి కలిగిన ఇబ్బందులను తెలుసుకొని వారికి డిన్నర్ ఏర్పాటు చేశారు. అలాగే వారికి అవసరమైన కొన్ని గ్రాసరీస్ అందజేశారు. ఈ ప్రమాదం వల్ల ఇబ్బందులు పడుతున్న వారందరికీ తాము అండగా ఉంటామని, తమకు చేతనయినంత సాయం చేస్తామని తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందించేందుకు వారిని మళ్లీ కలుస్తామని చెప్పారు. గాయపడిన విద్యార్థికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందించేందుకు తానా ముందుకు వచ్చింది.