ASBL Koncept Ambience
facebook whatsapp X

రివ్యూ : మరోసారి (కోలార్ గోల్డ్ ఫిల్డ్స్) KGF నేపధ్యం లో 'తంగలాన్‌'  

రివ్యూ : మరోసారి (కోలార్ గోల్డ్ ఫిల్డ్స్) KGF నేపధ్యం లో 'తంగలాన్‌'  

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థలు  : స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్, జియో స్టూడియోస్  
నటీనటులు : చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతీ తిరువత్తు, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై, సంపత్ రామ్, తదితరులు
సంగీత దర్శకుడు : జీవీ ప్రకాష్ కుమార్, ఎడిటింగ్ :  ఆర్కే సెల్వ
స్టంట్స్ : స్టన్నర్ సామ్, ఆర్ట్ : ఎస్ ఎస్ మూర్తి
స్టంట్ డైరెక్టర్: స్టన్నర్ సామ్, కథ : తమిళ్ ప్రభ
నిర్మాత: కేఈ జ్ఞానవేల్ రాజా, పా రంజిత్, జ్యోతి దేశ్ పాండే
రచన, దర్శకత్వం: పా రంజిత్
విడుదల తేదీ : 15.08.2024

తమిళ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌కు తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అపరిచితుడు చిత్రంతో సౌత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు. తాజాగా  విక్రమ్‌ నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా తంగలాన్. కర్ణాటకలోని కేజీఎఫ్ బంగారు గనుల నేపథ్యంలో  గోల్డ్ మైనింగ్‌ నేపథ్యంలో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌, కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ చిత్రం ఈ రోజే ఆగష్టు 15న  ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.  కబాలి డైరెక్టర్‌ పా రంజిత్‌తో జతకట్టి మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విక్రమ్. ఈ సినిమా కోసం భారీగా బరువు డిఫరెంట్‌ లుక్‌లోకి మారాడు విక్రమ్‌. ఇందులో విక్రమ్‌ అడవిలో జీవించే ఓ తెగకు చెందిన వ్యక్తిగా కనిపించబోతున్నారు. మాళవిక మోహనన్, పార్వతి తిరువత్తు హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్‌ మూవీపై అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా విక్రమ్‌ లుక్‌ తంగలాన్‌ చిత్రం మరింత బజ్‌ క్రియేట్‌ చేసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆడియన్స్‌ నుంచి ఎలాంటి రివ్యూస్‌ అందుకుంటుందో చూద్దాం.

కథ:

ఇక కథలోకి వెళ్తే తంగలాన్ (విక్రమ్), గంగమ్మ (పార్వతి తిరువోతు) భార్యభర్తలు. వేప్పూర్ గ్రామంలో వారికి ఉన్న చిన్న సాగుభూమిలోనే వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా బతుకుతూ ఉంటారు. అయితే కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో దాన్ని రాత్రికి రాత్రే ఊరి జమిందారు మనుషులు తగలబెట్టేస్తారు. ఉదయం కాగానే పన్నులు కట్టలేదని పంట భూమిని స్వాధీనం చేసుకుని.. తంగలాన్ కుటుంబంతో అన్యాయంగా వెట్టి చాకిరీ చేయిస్తాడు జమీందారు. తనతో పాటు తన కుటుంబం మొత్తం బానిసలుగా మారాల్సి వస్తోంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో బంగారం (‘కోలార్ గోల్డ్ ఫిల్డ్స్ లో’) వెతికి పెట్టమని బ్రిటిష్ దొర తంగలాన్ కి సంబంధించిన తెగ దగ్గరకు వస్తాడు. వేప్పూర్ సమీపంలోన అడవిలో ఉన్న బంగారు గనులు తవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ అక్కడ దెయ్యాలున్నాయని, అడవి మనుషులు చంపేస్తారనే భయంతో ఎవరూ ముందుకు రారు. దీంతో బంగారు గనులు తవ్వడానికి వస్తే ఎక్కువ డబ్బులు ఇస్తానంటూ వేప్పూర్ గ్రామస్థులకి చెబుతాడు దొర. దీంతో తన భూమిని విడిపించుకోవడానికి తంగలాన్ తన వాళ్లతో కలిసి ఆ బంగారు గనులు తవ్వడానికి దొరతో కలిసి బయలుదేరతాడు. అయితే తంగలాన్‌కి తరచూ ఓ కల వస్తుంటుంది. అందులో ఆరతి (మాళవిక మోహనన్) అతడ్ని వెంటాడుతూ ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరు? ఆరతికి తంగలాన్‌కి లింకేంటి? దొరతో కలిసి బంగారం తవ్వడానికి వెళ్లిన తంగలాన్, అతని మనుషులకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరికి బంగారం దొరికిందా? ఆ బంగారు గనులకి ఆరతికి లింకేంటి? అనేదే మిగిలిన కథ.

నటీనటుల హావభావాలు : 

ఇక నటన విషయానికొస్తే ఇందులో ఇద్దరు నేషనల్ అవార్డ్ విన్నర్స్ విక్రమ్-పార్వతి అద్భుతంగా నటించారు. విక్రమ్.. తంగలాన్ గా , అతని తాతగా , అరణ్యగా  ఇలా మొత్తం మూడు పాత్రల్లో నటించారు. తంగలాన్, అతని తాత పాత్రలు ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి. అరణ్య పాత్ర మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ మూడు పాత్రల్లోనూ విక్రమ్ జీవించేశారు. శివపుత్రుడు, అపరిచితుడు తర్వాత మళ్లీ ఆ రేంజ్‌లో యాక్ట్ చేసే అవకాశం ఈ చిత్రంలో దక్కింది. ఇక మలయాళ నటి పార్వతి తెలుగువారికి కొత్త కావచ్చు కానీ తమిళ, మలయాళ ప్రేక్షకులకి బాగా తెలుసు. విక్రమ్ భార్యగా ఆమె బాగా నటించింది. ఎమోషనల్ సీన్లలో చాలా నేచురల్‌గా కనిపించింది. ఇక మాళవిక మోహనన్ పోషించిన ఆరతి పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంది. నటన కంటే యాక్షన్ ప్రాధాన్యంగా ఉన్న ఈ పాత్రలో మాళవిక ఒదిగిపోయింది. కొన్న సీన్లలో ఆమెను చూస్తే భయమేస్తుంది. ఇక మిగిలిన పాత్రలు కూడా ఫర్వాలేదనిపించాయి.

సాంకేతికవర్గం పనితీరు:

మంచి కథా నేపధ్యాన్ని తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు పా. రంజిత్, కొన్ని చోట్ల ఉత్కంఠభరితమైన సీన్స్ ను రాసుకోవడంలో మాత్రం తడబడ్డాడు. కానీ, ఆయన రూపొందించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు ఇక జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్, బీజీఎం ఫర్వాలేదనిపించాయి. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించింనందుకు నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజాను అభినందించాల్సిందే! ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

విశ్లేషణ: 

తంగలాన్ సినిమాలో బలమైన కథ అయితే ఉంది. దానికి తగ్గా ఎమోషన్స్ కూడా ఉన్నాయి. మొదటి పార్ట్ అంతా సాదాసీదాగా అలా సాగిపోతూ ఉంటుంది. కానీ ఆరతి-తంగలాన్ తాత కి మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్ వచ్చినప్పుడు కథతో పాటు చూసే ఆడియన్స్‌కి కూడా కాస్త ఊపొస్తుంది. బంగారం సొంతం చేసుకోవాలనుకునే వారిని ఆరతి ఎన్ని ఇబ్బందులు పెడుతుందనేది తెరపై బాగానే చూపించారు. అయితే సెకండాఫ్ మొదలైన తర్వాత ఫస్టాఫ్‌లో జరిగిన కొన్ని సీన్లు మళ్లీ రిపీట్ అవుతాయి. దాంతో  ప్రేక్షకులకి తర్వాత ఏం జరుగుతుందనే దానిపై ఆసక్తి పోతుంది.  బతకాడానికి ప్రకృతిని వాడుకోవాలని ఫిక్స్ అయిపోయిన మనకి అదే ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉందనే సందేశాన్ని సినిమాలో చూపించారు డైరెక్టర్. యాక్షన్ సీక్వెన్స్‌లు అక్కడక్కడా బానే అనిపిస్తాయి. అయితే సాధారణమైన కథకి సోషియే ఫాంటసీ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కొంత వరకూ బానే అనిపించింది. అయితే, బోరింగ్ ప్లే, చాలా సీన్స్ రెగ్యులర్ గా అండ్ స్లోగా సాగడం, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా పీరియాడిక్ ప్రయోగాత్మకమైన చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చినా మిగతా వర్గం ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. 
 

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :