ASBL Koncept Ambience
facebook whatsapp X

విజయవాడకు ప్రత్యేకం....పోలీసు ఆచారం

విజయవాడకు ప్రత్యేకం....పోలీసు ఆచారం

విజయవాడలో జరిగే దసరా ఉత్సవాల్లో అత్యంత ప్రసిద్ధి పొందిన ఆచారాల్లో పోలీసుల ఆచారం ఒకటి. విజయవాడలో ఇంద్రకీలాద్రి ఉన్న పాతబస్తీ అధికారికంగా వన్ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి వస్తుంది. ఈ పోలీస్‌ స్టేషన్‌కు ఇంద్రకీలాద్రికి వందల సంవత్సరాలుగా అనుబంధం కొనసాగుతోంది. ఇక్కడి *పోలీసులు దుర్గమ్మను తమ ఆడపడచుగా, స్టేపన్‌ ప్రాంతంలో ఉన్న రావిచెట్టు, అక్కడి ప్రాంతాన్ని అమ్మ పుట్టినిల్లుగా* భావిస్తారు. అంతేకాదు... రావిచెట్టును అమ్మవారి స్వరూపంగా భావించి, ఆ చెట్టుకు పోలీసులే స్వయంగా నిత్యపూజ చేస్తారు. 

ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాల్లో ఈ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు అమ్మకు పుట్టింటివారి పాత్ర పోషిస్తారు*. కొండమీద దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యే ముందురోజే పోలీస్‌ స్టేషన్‌లో ఉత్సవాలు మొదలవుతాయి. ఇక్కడి రావిచెట్టు ప్రాంతాన్ని సర్వాంగసుందరంగా అలంకరించి, అమ్మకు పూజలు చేస్తారు. ఇక్కడ ఉన్న అమ్మవారి మూర్తిని కొండ మీదకు తీసుకువెళ్తారు. తమ ఆడపడచుకు పసుపు కుంకుమలు, పట్టుచీర, సారె తీసుకువస్తారు. వీరు తీసుకువచ్చిన పట్టుచీర అలంకరించిన తర్వాతనే కొండపై ఉత్సవాలు మొదలవుతాయి. 

ఉత్సవాల్లో అమ్మకు కట్టే తొలి పట్టుచీర పోలీసులు ఇచ్చిందే కావటం విశేషం. ఎంతటి గొప్పవారు ఇచ్చిన చీరనైనా, పోలీసులు ఇచ్చిన చీరను అమ్మవారికి అలంకరించిన తర్వాతనే అలంకరిస్తారు.* ఉత్సవాల్లో జరిగే రథోత్సవంలో కూడా పోలీసుల పాత్రే ఎక్కువగా ఉంటుంది. అమ్మవారి రథాన్ని స్థానిక పోలీఉసు అధికారులే స్వయంగా లాగుతారు. ఉత్సవమూర్తులను కూడా కొండ మీద నుంచి పోలీసు వారే కిందకు తీసుకువస్తారు. తరతరాలుగా ఇందులో ఎటువంటి మార్పూ లేదు. 

దసరా చివరి రోజున కృష్ణానదిలో నిర్వహించే తెప్పోత్సవంలో పోలీసు అధికారులే ముఖ్యపాత్ర పోషిస్తారు. ఊరేగింపు అనంతరం ఉత్సవమూర్తులను రావిచెట్టు ప్రాంతానికి తీసుకువస్తారు. అక్కడ అమ్మవారు కొంత సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత, తిరిగి కొండమీదకు తీసుకువెళ్తారు. ఇలా, పోలీసు అధికారులే పుట్టింటి పాత్ర పోషించి, అమ్మవారి ఉత్సవాలు నిర్వహించంటం మరెక్కడా కనిపించదు.* 

ఈ ఆచారం రావటానికి వెనుక చారిత్రక గాథ ఒకటి ఉంది. కొండవీటి రెడ్డి రాజుల కాలం నుంచి ఈ ఆచారం వచ్చినట్టు పరిశోధకులు అంచనావేస్తున్నారు. రెడ్డి రాజుల కాలంలో విజయవాడ ప్రాంతంలో పనిచేస్తున్న మంగయ్య అనే సిపాయికి అమ్మవారు స్వప్నంలో కనిపించి, తాను దుర్గమ్మనని, తన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమని చెబుతుంది. స్వప్నంలో కనిపించిన ప్రకారం తవ్వకాలు జరిపిన మంగయ్యకు అమ్మవారి విగ్రహం లభిస్తుంది. ఈ విగ్రహాన్ని ఇంటికి తీసుకువెళ్తాడు మంగయ్య. అక్కడ మంగయ్య కుమార్తెకు అమ్మవారి ఒంటి మీదకు వస్తుంది. ఆ కుమార్తె అమ్మలో ఐక్యం చెందుతుంది. అమ్మ మహిమ తెలుసుకున్న మంగయ్య అమ్మ చెప్పిన రీతిలో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తాడు. ఇలా, మంగయ్య నుంచి అమ్మ ఆరాధన ఆచారంగా వస్తోంది.

కాలక్రమంలో సిపాయిలు రక్షకభటులుగా (పోలీసులుగా) మారినా, ఈ ఆచారం మాత్రం మారలేదు. పుట్టింటివారిగా సారె ఇవ్వటం నుంచి రథోత్సవం వరకు పోలీసులే ప్రధానపాత్ర పోషిస్తారు. కులమతాలతో సంబంధం లేకుండా ఈ స్టేషన్‌లో పనిచేసే అధికారి ఎవరైనా సరే అమ్మకు స్వయంగా సారె సమర్పిస్తారు. ఈ ఆచారాన్ని పోలీసుల నుంచి తప్పించాలని కొందరు ప్రయత్నిస్తే, వారికి ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయని కూడా ఇక్కడి వారు చెబుతారు.

కానిస్టేబుల్‌ నుంచి కమీషనర్‌ వరకు స్థాయీభేదాలు మరచి దసరా ఉత్సవాల్లో ఆనందంగా పాల్గొనటం దేశంలో మరెక్కడా కనిపించని అరుదైన ఆచారం. ఇలా, ఎన్నో మరెన్నో ప్రత్యేకతలతో విజయవాడ దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతూ, భక్తకోటిని అలరిస్తున్నాయి.

 

- నడింపల్లి సీతారామ రాజు

 

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :